అసలు కిక్ అదే… యువరాజ్ విధ్వంసం… మరో ఎండ్ లో ధోని..!

Yuvraj  singh made 150 with  MS Dhoni partnershipటీమిండియా రెండు వరల్డ్ కప్ లు గెలవడంలో కీలక పాత్ర పోషించిన క్రికెటర్ యువరాజ్ సింగ్, జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. కారణాలు ఏమైనా గానీ… ఫాంలో లేకపోవడమో, కెప్టెన్ గా ఉన్న ధోని పక్కన పెట్టడమో… ఏదైనా గానీ జట్టుకు మాత్రం చాలా కాలం పాటు దూరమయ్యాడు. అయితే యువీ అంటే అభిమానుల మదిలో ప్రత్యేక స్థానమే ఉంది. అలాంటి యువరాజ్ పేరు ఒక్కసారిగా తెరపైకి తీసుకువచ్చాడు విరాట్ కోహ్లి. కెప్టెన్సీ చేపట్టిన వెంటనే యువరాజ్ ను ఎంపిక చేయడం ఒక విధంగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

మీడియా వర్గాలకు కూడా షాకింగ్ లా మారిన ఈ వార్తపై తర్వాత కోహ్లి కూడా వివరణ ఇచ్చుకున్నాడంటే, ఏ రేంజ్ లో యువరాజ్ రీ ఎంట్రీ వచ్చిందో అర్ధం చేసుకోవచ్చు. అలాగే వస్తూ వస్తూనే మొదటి మ్యాచ్ లో తను ఎదుర్కొన్న రెండవ బంతినే సిక్సర్ గా మలిచి తన రేంజ్ ఏంటో యువరాజ్ చెప్పకనే చెప్పాడు. అయితే ఆ ఆనందం ఎక్కువ సేపు ఉండలేకపోయింది. యువీ అవుటైన వెంటనే అంతా నిరుత్సాహపడినా… యువరాజ్ కొట్టిన సిక్స్ చాలు… మ్యాచ్ కే హైలైట్… అంటూ అభిమానులు పండగ చేసుకున్నారు.

ADVERTISEMENT

అయితే వారికి అసలు విందు కటక్ లో లభించింది. యువరాజ్ కొడుతున్న షాట్లు చూసి ముగ్ధులైపోవడం క్రికెట్ ప్రేమికుల వంతయ్యింది. ఇంతకాలం… ఇలాంటి షాట్లనే కదా వీక్షకులు మిస్ అయ్యింది అన్నట్లుగా స్ట్రెయిట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్ తో మంత్రముగ్ధులను చేసాడు. ముఖ్యంగా స్ట్రెయిట్ డ్రైవ్స్ ఆడుతుంటే… కళ్ళు అప్పగించి చూస్తుండడం టీవీల ముందు కూర్చున్న వారి వంతయ్యింది. అలాగే యువీ అవుట్ చేద్దామని వేసిన ప్రతి షార్ట్ పిచ్ బంతిని పుల్ చేస్తూ… ఒకప్పుడు ఏదైతే తన వీక్ నెస్ గా బౌలర్లు భావించారో, ఇపుడు అదే బంతులను ఫోర్లు, సిక్సర్లుగా మలిచి గట్టి సమాధానం ఇచ్చారు.

ఇక, అన్నింటి కంటే మరో హైలైట్ ఏమిటంటే… ఇంగ్లాండ్ బౌలర్ల మీద యువరాజ్ విరుచుకుపడుతున్న సమయంలో మరో ఎండ్ లో ధోని బ్యాటింగ్ చేయడం. అవును… ఇప్పటివరకు యువరాజ్ ను టీంలో ఎందుకు లేకుండా పోయాడో అన్న దానికి ఎవరెన్ని కారణాలు చెప్పినా… ధోనియే అసలు కారణమని యువరాజ్ తండ్రి పలుమార్లు బహిరంగంగానే విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇపుడు అదే ధోనిని మరో ఎండ్ లో పెట్టుకుని యువరాజ్ చితకకొట్టుడు కొడుతుంటే… బహుశా యువీ తండ్రి పొందిన ఆనందం అంతా ఇంతా కాదని చెప్పవచ్చు.

అయితే ఎవరు ఆడినా, ఎందుకు ఆడినా… అది దేశం కోసం, దేశ ప్రతిష్టను పెంచేందుకే గనుక, వ్యక్తిగతంగా దక్కే కిక్ ను పక్కనపెడితే… యువీ ఈ విధంగా ఆడడమే అభిమానులు ఆశించేది. ఒక్క అభిమానులే కాదు, క్రికెట్ పై మక్కువ ఉన్న వారికి యువీ కొట్టే షాట్లు కన్నులవిందు చేస్తాయి. బహుశా ‘మగువల’ అందాలను కవులు ఎంతగా వర్ణిస్తారో, యువీ కొట్టే షాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయని చెప్పకతప్పదు. ఈ దూకుడు ఇక్కడితో ఆగకూడదు… యువరాజ్ ఈజ్ బ్యాక్ విత్ ఎ బ్యాంగ్… అనిపించేలా బ్యాటింగ్ దద్దరిల్లిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories