తీవ్ర ఆర్ధిక సంక్షోభం దిశగా ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తుంది. ఏడాది కాలంలో తీసుకోడానికి అనుమతించిన అప్పులను రాష్ట్ర ప్రభుత్వం కేవలం సగం సంవత్సరం కూడా కాకుండా పూర్తి చెయ్యడంతో అప్పుల కోసం కొత్త పుంతలు తొక్కుతుంది. ఈ ఏడాది డిసెంబర్ వరకు 20000 కోట్లు అప్పు తెచ్చుకోవచ్చు, అయితే ఇప్పటికే అది అయిపోయింది.
ఇంకో 6000 కోట్ల అప్పుకు అవకాశం ఉన్నా ఈ ఏడాది చివరి త్రైమాసికం వరకూ అది తీసుకోవడం వీలు లేదు. దీనితో చట్ట సవరణ ద్వారా అప్పులు పెంచుకునే ఎఫ్ఆర్బీఎం లిమిట్ ని 3% నుండి 5% కు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. కేబినెట్ సమావేశం లేకుండా అందుబాటులో ఉన్న మంత్రుల సంతకాలతో గవర్నర్ కు చట్ట సవరణ దస్త్రం పంపారు.
కరోనా వల్ల అతలాకుతలమైన పరిస్థితుల్లో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించేందుకు ఎఫ్ఆర్బీఎం పరిధిని 5 శాతానికి పెంచేందుకు కేంద్రం అంగీకరించింది. అందులో 0.5 శాతానికి సమానమైన రుణ మొత్తాన్ని ఏ నిబంధనలూ లేకుండా వాడుకోవచ్చు. మరో 1.5 శాతం పరిమితిని వినియోగించుకోవాలంటే కొన్ని షరతులు విధించింది.
‘ఒకే దేశం- ఒకే రేషన్ కార్డు అమలు’, విద్యుత్తు రాయితీల మొత్తం నేరుగా రైతులకు ఇచ్చి వారి నుంచి బిల్లులకు తగ్గట్టుగా వసూలు చేయడం వంటి మూడు షరతులు ప్రతిపాదించింది. ఈ షరతుల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉంటాయి… అయితే వీటిని ఒప్పుకోకతప్పని పరిస్థితి. ఈ దస్త్రం ఆమోదం పొందితేనే వచ్చే నెలలో జీతాలు, పింఛన్లు ఇచ్చే పరిస్థితి ఉంటుంది.





