నేటికి తెలంగాణ ఏర్పడి 12 ఏళ్ళు పూర్తయి 13వ సంవత్సరం. కేంద్రంతో పోరాడి సాధించుకున్నారు కనుక తెలంగాణలో ప్రతీ ఒక్కరికీ ఇది భోవోద్వేగంతో ముడిపడి ఉంటుంది. కనుక రాష్ట్ర వ్యాప్తంగా అందరూ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. చాలా సంతోషం. ఈ సందర్భంగా ఆంధ్రా ప్రజల తరపున తెలంగాణ ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వానికి శుభాకాంక్షలు.
ఈ పుష్కర కాలంలో తెలంగాణలో రాజకీయంగా వచ్చిన మార్పులు చూస్తే తిరుగేలేదనుకున్న బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, బహిష్కరణకు గురైన కల్వకుంట్ల కవిత టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసుకోవడం కనిపిస్తుంది.
ఆర్ధికంగా చూస్తే ధనిక రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ పుష్కర కాలంలో అప్పుల పాలైంది. దీని గురించి కాంగ్రెస్-బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం నిందించుకుంటున్నాయి. కనుక అప్పులు వాస్తవం!
తెలంగాణ అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన మాట వాస్తవం. అందుకు నాడు సిఎం చంద్రబాబు నాయుడు మొదలు కేసీఆర్, రేవంత్ రెడ్డి వరకు ప్రతీ ఒక్కరూ చేసిన కృషే కారణం.
ఓ స్థాయి తర్వాత డబ్బే డబ్బుని సంపాదించి పెడుతుందన్నట్లు నాటి నుండి జరిగిన హైదరాబాద్ అభివృద్ధి వల్లనే హైదరాబాద్‌తో సహా తెలంగాణ జిల్లాలో అభివృద్ధి చెందుతున్నాయి.
అదేవిధంగా అయితే కేసీఆర్ హయంలో జిల్లాలను, చిన్న పట్టణాలను, పల్లెలను కూడా అభివృద్ధి చేయడం వలన ఆయా ప్రాంతాలలో కూడా నేటికీ అభివృద్ధి కొనసాగుతోంది.
ప్రాజెక్టుల విషయానికి వస్తే మొట్ట మొదట కనిపించేది కాళేశ్వరమే. దాంతోనే తెలంగాణ పలు జిల్లాలకు సాగు తాగు నీరు అందింది.
కానీ కట్టిన మూడేళ్ళలోపే ఆ ప్రాజెక్టు క్రుంగిపోగా, దాని దిగువనున్న రెండు మూడు బ్యారేజీలు దెబ్బ తిన్నాయి.
ఇది దేశంలోనే అతిపెద్ద అవినీతికి నిదర్శనమని కాంగ్రెస్ వాదిస్తోంది కానీ కేసుల విషయంలో అడుగు ముందుకు వేయలేకపోతోంది. అలాగే ఫోన్ ట్యాపింగ్, ఎఫ్-1 రేసింగ్ కేసులలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకు వేయలేకపోతోంది. కనుక ఇది దాని నిసహాయతని, బీఆర్ఎస్ పార్టీ లోపాయికారి రాజకీయాలకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
పుష్కరకాలం తర్వాత తెలంగాణ పరిస్థితిని స్థూలంగా చూస్తే నాడు ఆంధ్రాతో కలిసి ఉండలేమని ఆంధ్రా పాలకుల పాలన వద్దని విడిపోయారు.
కానీ ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎవరి తల్లి వారిదే అంటున్నాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నాయి.
బీఆర్ఎస్ హయంలో తీసుకున్న పలు నిర్ణయాలను కాంగ్రెస్ ప్రభుత్వం చాలా వాటిని నిలిపివేస్తే, రేపు మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పనులన్నిటినీ పునః సమీక్షిస్తామని బీఆర్ఎస్ నేతలు హెచ్చరిస్తున్నారు.
మేము అధికారంలోకి రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన విగ్రహాలన్నీ కూల్చేస్తామని టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నిన్ననే ప్రకటించారు.
కనుక రాజకీయంగా చూసినట్లయితే రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ఎటువంటి విద్వేషభావనలు ఉండేవో నేడు అంతకంటే ఎక్కువే ఉన్నాయని చెప్పక తప్పదు.




