17ఏ ఏసీబీ కోర్టుకు అర్దమైంది కానీ…

Court-Vijayawada

టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలందరినీ ఏదో ఓ కేసులో ఇరికించేసి జైలుకి పంపించేస్తే, శాసనసభ ఎన్నికలలో వైసీపి సులువుగా గెలిచేయవచ్చని గొప్ప ‘మాస్టర్ ప్లాన్’ వేసింది.

ఈ కొత్త ఆలోచన కలిగించిన ఉత్సాహంలో ముందూ వెనుకా చూసుకోకుండా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసి జైల్లో వేసి టపాకాయలు కాల్చుకుని, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసేసుకున్నారు.

ADVERTISEMENT

అయితే నిందితులు ఆర్ధిక నేరాలకు పాల్పడ్డారని నిరూపించే సాక్ష్యాధారాలు సేకరించి వాటన్నిటినీ చార్జి షీట్లో పేర్కొనాలని కానీ, అవినీతి నిరోధక శాఖ చట్టాలలోని సెక్షన్ 17ఏ ప్రకారం ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసే ముందు గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని గానీ అనుకోలేదు.

అందుకే ఈ కేసులపై జగన్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడాల్సి వస్తోంది. అందుకే సుప్రీంకోర్టు చంద్రబాబు నాయుడుని బెయిల్‌ మంజూరు చేసింది. అందుకే ఈ కేసుని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది.

సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఎదురుదెబ్బలు తినడం జగన్‌ ప్రభుత్వానికి కొత్తేమీ కాదు. కానీ తొలిసారిగా ఏసీబీ కోర్టులో కూడా ఎదురుదెబ్బ తింది.

మాజీ మంత్రి, ఏపీ టిడిపి అధ్యక్షుడు అచ్చన్నాయుడిని కూడా లోపల వేసేస్తే ఓ పనైపోతుందనుకున్న జగన్‌ ప్రభుత్వం, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఈఎస్ఐ ఆస్పత్రులలో మందులు, వైద్య పరికరాల కొనుగోలులో అవకతవకలు జరిగాయంటూ అవినీతి నిరోధకశాఖ చేత ఓ కేసు పడేయించింది.

అయితే ఇదివరకు స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులలో చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేయడానికి, అరెస్ట్ చేసి జైలుకి పంపడానికి అనుమతించిన విజయవాడ ఏసీబీ కోర్టు… న్యాయమూర్తి హిమబిందుయే ఇప్పుడు అచ్చన్నాయుడిపై కేసు నమోదు చేయడానికి సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్‌ అనుమతి తీసుకోవాలని చెపుతూ ఆ కేసు విచారణకు స్వీకరించేందుకు తిరస్కరించడం విశేషం.

సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బలు తగిలినా, ఇప్పుడు ఏసీబీ కోర్టు మళ్ళీ ఈ విషయం గుర్తుచేసి మరీ చెప్పినా ఏసీబీ అధికారులు అవేమీ పట్టించుకోకుండా మళ్ళీ అభియోగపత్రాన్ని దాఖలు చేయాలని ప్రయత్నించడం మరో విశేషం! దానినీ న్యాయమూర్తి తిరస్కరించడంతో జగన్‌ ప్రభుత్వానికి ఏసీబీ కోర్టులో కూడా ఎదురుదెబ్బ తగిలిన్నట్లయింది.

అయితే టిడిపి జాతీయ అధ్యక్షుడుగా వ్యవహరిస్తూ, మూడుసార్లు ముఖ్యమంత్రి పనిచేసి, ప్రస్తుతం శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా, టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబు నాయుడుపై కేసులు నమోదు చేసేందుకు, అరెస్ట్ చేసేందుకు అభ్యంతరం చెప్పని, ఆయనకు బెయిల్‌ మంజూరు చేసేందుకు పదేపదే నిరాకరించిన ఏసీబీ కోర్టుకి, ఇప్పుడు 17ఏ నిబందన గుర్తుకు రావడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

బహుశః దీనిపై సుప్రీంకోర్టులో జరుగుతున్న న్యాయపోరాటాలు, 17ఏ పై సుప్రీం న్యాయమూర్తుల అభిప్రాయాలు, ఇప్పుడు ఈ అంశంపై విస్తృత ధర్మాసనం విచారణ చేపట్టబోతుండటంతో ఏసీబీ కోర్టు ఆలోచనలు మారిన్నట్లు భావించవచ్చు.

కాస్త ఆలస్యంగానైనా 17ఏ నిబంధన విషయంలో ఏసీబీ కోర్టు తప్పుని సరిదిద్దుకుంది. కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం సిద్దంగా లేదు. కనుక మున్ముందు మళ్ళీ మళ్ళీ ఇలాంటి ఎదురుదెబ్బలు తినక తప్పకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories