రాజకీయాలలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, సెటైర్లు, కౌంటర్లు, స్లోగన్లు ఇలా ప్రతిదీ చాల కీలకమనే చెప్పాలి. అందునా ఎన్నికల ప్రచార సమయంలో ఆయా పార్టీ అధినేతల నోటి నుంచి వచ్చే ప్రతి వాక్యము ఆ పార్టీ మద్దతుదారులకు ఒక భగవద్గీత శ్లోకం మాదిరి మార్గం చూపింది.
దీన్నే ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ట్రేండింగ్ అంటూ ఉదహరిస్తున్నాం. అయితే ఈ ఏడాది ఏపీ రాజకీయాలను ప్రభావితం చేసిన ఆ టాప్ ట్రేండింగ్ విమర్శలు, కౌంటర్లు, స్లోగన్లు ఏమిటో ఒక్కసారి రీకాప్ చేసుకుంటే వాటిలో ముఖ్యమైనవాటిని ఇక్కడ చర్చించుకుందాం.
అందరి కంటే ముందుగా ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన అధికార వైసీపీ పార్టీ ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి “సిద్ధం” అంటూ బహిరంగ సభలు నిర్వహించి ఎన్నికలకు మేము సిద్ధం బ్యాలట్ బటన్ నొక్కడానికి మీరు సిద్ధమా.? అంటూ ఈ సిద్ధం అనే పదాన్ని ట్రేండింగ్ లోకి తెచ్చారు అప్పటి ముఖ్యమంత్రి వైస్ జగన్.
ఇక ఇదే సిద్ధం స్లోగన్లతో అటు టీడీపీ, ఇటు జనసేనలు ఇక మీరు ప్రతిపక్షానికి సిద్ధమా.? మీ అవినీతి అక్రమాలకు జైలుకెళ్లడానికి సిద్ధమా.? అంటూ వైసీపీ పై ప్రతి దాడి చేసి వారి స్లోగన్ తోనే వారినే దెబ్బ కొట్టారు. అలాగే వైసీపీ ప్రభుత్వంలో వచ్చిన నాడు – నేడు, అమ్మ ఒడి వంటి విప్లవాత్మక పథకాలు చూస్తే చంద్రబాబు కడుపు మండదా అక్కా.? మండదా చెల్లి.? మండదా తమ్ముడు.? అంటూ జగన్ మరో స్లోగన్ ను ప్రచారంలోకి తెచ్చారు.
ఇక ఈ మండదా అనే స్లోగన్ ను టీడీపీ, జనసేనలు వాడిన విధానానికి వైసీపీకి చాలా గట్టిగా మండిందనే చెప్పాలి. ఏపీ కి రాజధాని లేకపోతే మండదా అన్నా.? రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతే మండదా తమ్ముడు.? పేదవాడి ఆకలి తీర్చే అన్నా క్యాంటిన్ రద్దు చేస్తే మండదా అమ్మా.? అంటూ వైసీపీ కట్టెతోనే ఆ పార్టీ కింద చాల పెద్ద మంటే పెట్టారు టీడీపీ శ్రేణులు.
ఇక ‘గోవిందా గోవిందా’ అంటూ మొదలు పెట్టిన జగన్, బాబుని నమ్మి ఓటేస్తే మీ భవిష్యత్ గోవిందా, మేమిచ్చే నవరత్నాలు గోవిందా అంటూ గోవిందా అనే పదాన్ని ట్రెండింగ్లోకి తెచ్చారు. అయితే అదే గోవిందా తో వైసీపీ కి పంగనామాలు పెట్టారు ఏపీ ఓటర్లు. ఇలా వైసీపీ ఇచ్చిన స్లోగన్స్ తో వైసీపీ ఫ్యాన్ రెక్కలు విరిచిన టీడీపీ, జనసేనలు వైసీపీ కి కౌంటర్ గా మరికొన్ని స్లోగన్స్ ను ట్రెండ్ చేసాయి. ఇక బాబు కూడా మునుపెన్నడూ లేని విధంగా తన ప్రచార శైలిని మార్చుకుని ట్రెండ్ ఫాలో అయ్యారు.
‘హూ కిల్డ్ బాబాయ్’…’సైకో రెడ్డి’…’బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ’…’కోడికత్తి పోయి గులకరాయి వచ్చే’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చిన స్లొగన్స్ ప్రజల్లోకి చాల బలంగా వెళ్లాయి. అలాగే వాటిని కౌంటర్ చేయడానికి అటు వైసీపీ చేతులో ఎటువంటి అస్త్రాలు లేకపోవడం కూడా ఈ పదాలను సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యేలా చేసాయి.
ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన ‘హలో ఏపీ బై బై వైసీపీ’…అనే స్లోగన్ ప్రతి ఇంటి గడపలోకి వెళ్ళిపోయింది. అటు సోషల్ మీడియాలోనే కాదు ఇటు సామాన్యుడి నోట కూడా ఇదే స్లోగన్ మారుమోగింది, వైసీపీ నోరు మూయించింది. ఇలా బాబు, పవన్ కలిసి జగన్ ముఖ్యమంత్రి పదవికి గోవింద కొట్టారు.
సిద్ధమా అంటూ వైసీపీ అధినేత వైస్ జగన్ మోహన్ రెడ్డి మొదలు పెట్టిన యుద్ధం లో ఏపీ భవిష్యత్ కు నాది గ్యారెంటీ అంటూ బాబు హామీ ఇస్తే, వైసీపీకి ఏపీ ప్రజలతో బై బై.. చెప్పించడానికి నేను సిద్ధం అంటూ పవన్ ముందుకొచ్చారు. ఇలా ఈ 2024 ఎన్నికల ప్రచార స్లోగన్స్ తో “కథ అమరావతికి వైసీపీ ఇంటికి” వెళ్ళింది.




