జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు, క్యాట్ చేత తనివితీరా మొట్టికాయలు వేయించుకున్న తర్వాత ఐపిఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుని శుక్రవారం పదవీ విరమణకు కొన్ని గంటల ముందు విదులలోకి తీసుకుంది. అప్పుడు కూడా అంత సీనియారిటీ ఉన్న ఆయన పట్ల జగన్ ప్రభుత్వం పైశాచికానందమే ప్రదర్శించింది.
ఇన్నేళ్ల సుదీర్గమైన సర్వీసు, ఎంతో అనుభవం ఉన్న ఆయనకు విజయవాడలోని పోలీస్ శాఖకు చెందిన ప్రింటింగ్, స్టేషనరీ అండ్ స్టోర్స్ పర్చేజ్ కమీషనర్‌గా పోస్టింగ్ ఇచ్చింది. అయితే పోస్టింగ్ ఏదైనప్పటికీ ఆయన దానిని చాలా హుందాగానే స్వీకరించారు. డ్యూటీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడేటప్పుడు కూడా ఆయన చాలా హుందాగా మాట్లాడారు తప్ప జగన్ ప్రభుత్వం మీద తన అక్కసు వెళ్ళగ్రక్కలేదు.
“ఇప్పుడు నేను ప్రభుత్వోద్యోగిని. కనుక వివాదాస్పదమైన అంశాల గురించి మాట్లాడకూడదు. కానీ ఇన్నేళ్ళుగా నా కష్టకాలంలో నాకు తోడుగా నిలిచి, ధైర్యం చెప్పిన శ్రేయోభిలాషులు అందరికీ పేరుపేరునా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ప్రస్తుతానికి ఇంతకు మించి మాట్లాడలేను,” అని అన్నారు.
ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఆయన డ్యూటీ ముగుస్తుంది కనుక అంతకు ముందు ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు.
డ్యూటీలో చేరిన గంటల వ్యవధిలో పదవీ విరమణ చేసేలా చేయడం జగన్ ప్రభుత్వ పైశాచిక ఆనందానికి మరో నిదర్శనమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. జగన్ ఎవరిపైనైనా కక్షగడితే అది ఏవిదంగా ఉంటుందో అర్దం చేసుకునేందుకు ఏబీ వేంకటేశ్వర రావు ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఉన్నారని టిడిపి నేత దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు.




