హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకుంటే ఎవరు వద్దంటారు?

jagan-odarpu

సంక్షేమ పధకాలకు తనకే పూర్తి పేటెంట్ హక్కులున్నట్లు జగన్మోహన్‌ రెడ్డి మాట్లాడేవారు. తాను బటన్ నొక్కి ప్రజలకు మేలు చేస్తున్నానని కనుక అందరూ తనకు రుణపడి ఉన్నారు కనుక ఎన్నికలలో తప్పకుండా తనకే ఓట్లు వేసి గెలిపించాలని కోరుతుండేవారు.

కానీ ఇంత మేలు చేసినా ఫలితాలు చూసి షాక్ అయ్యానని, రాజకీయాలపై విరక్తి కలిగిందని, హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించిందని జగన్‌ చెప్పుకున్నారు. ఆయన హిమాలయాలకు వెళ్ళిపోవాలనుకుంటే ఏపీ ప్రజలు ఎవరూ ఆపబోరు. ఈ విషయం జగన్‌కు కూడా తెలుసు. కనుకనే బెంగళూరులో నిర్మించుకున్న విలాసవంతమైన ప్యాలస్‌కు వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారు. తనకు ఓట్లు వేసిన 40 శాతం ప్రజల కోసం రాజకీయాలు చేసేందుకు వస్తానని చెపుతున్నారు.

ADVERTISEMENT

అభివృద్ధి-సంక్షేమ పధకాలు సమాంతరంగా సాగాల్సిన అవసరం ఉందని, అభివృద్ధి ఫలాలను సంక్షేమ పధకాలకు వినియోగించుకోవాలి తప్ప సంక్షేమ పధకాలే అభివృద్ధి అని అనుకోకూడదని చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో చెపుతూనే ఉన్నారు.

జగన్‌కు కూడా ఈ విషయం తెలుసు. కానీ అభివృద్ధి కోసం శ్రమించడం కంటే సంక్షేమ పధకాల పేరుతో ప్రజలకు డబ్బు పంచుతూ ఉంటే వారు మళ్ళీ మళ్ళీ తననే గెలిపిస్తుంటారనే భ్రమ లేదా దురాశకు పోయి నష్టపోయారు.

ఏ దేశం… ఏ రాష్ట్రంలోనైనా వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, అనాధలు, దీర్గకాల రోగాలతో బాధపడేవారు, నిరుపేదలు ఉంటారు. కనుక వారికి సంక్షేమ పధకాలు అందించడం చాలా అవసరమే. అందుకే చంద్రబాబు నాయుడు ముందుగా వారందరికీ జూలై 1వ తేదీ నుంచే పెంచిన పింఛన్లు అందించేందుకు ఏర్పాట్లు చేశారు.

కానీ జగన్‌ అవ్వా తాతా, అక్కమ్మలు, చెల్లెమ్మలూ అంటూనే ప్రజలందరినీ తన పార్టీకి ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని ప్రయత్నించారు. అందుకే అనర్హులకు కూడా సంక్షేమ పధకాల పేరుతో డబ్బు పంచిపెట్టారు.

వాటి కోసం జగన్‌ విచ్చల విడిగా అప్పులు చేశారు. ప్రభుత్వంపై భారం పెంచుకున్నారు, పన్నులు, ఛార్జీలు పెంచి ప్రజలపై కూడా భారం వేశారు.

ఇన్ని తప్పులు చేస్తూ ప్రజలకు ‘మేలు’ చేశానని నిసిగ్గుగా గొప్పలు చెప్పుకోవడం, ఆ మేలుకి ఓట్ల రూపంలో ప్రతిఫలం ఆశించడం అన్నీ కూడా తప్పులే కదా?

సమాజంలో అవసరమైన వారికి మాత్రమే సంక్షేమ పధకాలు అందిస్తూ మిగిలిన అందరికీ ఉద్యోగాలు, ఉపాధి చేసుకుని తమ కాళ్ళపై తాము నిలబడేలా చేసినప్పుడే ఆ సమాజం అన్ని విదాలా అభివృద్ధి చెందుతుంది.

ఇంత చిన్న విషయం జగన్‌కు తెలియదనుకోలేము. కానీ ప్రజలందరూ ప్రభుత్వంపై ఆధారపడేలా చేయగలిగితే అందరినీ తన చెప్పు చేతల్లో ఉంచుకోవచ్చనే దుష్ట దురాలోచన చేశారు. కానీ ప్రజలు ఆయన దురాలోచనని పసిగట్టి హిమాలయాలకు వెళ్ళిపోవాలనిపించే అంతగా పెద్ద షాక్ ఇచ్చారు.

ఏది ఏమైనప్పటికీ ఈ తాజాతీర్పుతో ఒకటి స్పష్టం అయ్యింది. ప్రజల ఆకాంక్షలను, వారి సమస్యలను, అభివృద్ధిని పట్టించుకోకుండా సంక్షేమ పధకాల పేరుతో ఎన్ని లక్షలు కోట్లు పంచిపెట్టేసినా ఎన్నికలలో ఓటమి తప్పదని. కనుక ఈ విషయంలో టిడిపి కూటమి ప్రభుత్వం కూడా ఆలోచించి అడుగులు వేయడం చాలా అవసరమే.

ADVERTISEMENT
Latest Stories