ఢిల్లీలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు… భారత్‌ వేగానికి నిదర్శనమేగా?

AI Impact Summit India

ఈ శతాబ్దపు గొప్ప ఆవిష్కరణలో ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్) కూడా ఒకటి. ప్రతీ నూతన ఆవిష్కరణకు మొదట్లో ఎదురయ్యే సమస్యే ఏఐకి కూడా ఎదురైంది. దీని వలన ఉద్యోగాలు పోతాయని మొదట్లో చాలా మంది భయపడినప్పటికీ, ఇప్పుడు ఏఐ చేస్తున్న అద్భుతాలను చూసి మురిసిపోతూ ఇప్పుడు అందరూ ఎడాపెడా వాడేసుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

తొలిసారిగా సాఫ్ట్‌వేర్‌, ఐటి రంగంలో చదువులు, ఉద్యోగావకాశాలు వచ్చినప్పుడు భారతీయులు వాటిని అందిపుచ్చుకొని నేడు అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు. గూగుల్ సిఈవో సుందర్ పిచాయ్ ఇందుకు ఓ చక్కటి నిదర్శనం.

ADVERTISEMENT

ఇప్పుడు కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా భారతీయ యువత అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. దేశంలో అనేక స్టార్టప్ కంపెనీలు ఏఐతో రకరకాల ప్రయోగాలు చేస్తున్నాయి. ఏఐ టూల్స్ వాడుతున్నవారికి వాటి ఆవిష్కరణల గురించి బాగా తెలుసు.

సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడం, వినియోగించుకోవడంలో భారత్‌ ఎప్పుడూ ముందే ఉంటుంది. కనుక ప్రపంచంలో తొలిసారిగా ‘ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ ఢిల్లీలో జరుగుతోంది. ఈ నెల 17 నుంచి 21 వరకు ఈ సదస్సు జరుగుతుంది.

భారత్‌తో సహా 119 దేశాల నుంచి ఐటి కంపెనీల ప్రతినిధులు, ఆయా దేశాల ప్రభుత్వ ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. ముఖ్యంగా మన దేశంలో ఏఐ రంగంలో కృషి చేస్తున్న యువత పెద్ద ఎత్తున ఈ సదస్సులో పాల్గొనడం విశేషం.

ఈ సదస్సుకు హాజరైన సుందర్ పిచాయ్‌, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, టాటా గ్రూప్ చైర్మన్‌ చంద్రశేఖరన్ వంటి ప్రముఖులు సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకొని వినియోగించుకోవడంలో భారత్‌ యువత చూపుతున్న శ్రద్ధ, నైపుణ్యం, ఆవిష్కరణలు అద్భుతంగా ఉన్నాయని మెచ్చుకున్నారు.

సుందర్ పిచాయ్ మాట్లాడుతూ తాను భారత్‌ పర్యటనకు వచ్చిన ప్రతీసారి దేశంలో కనిపిస్తున్న మార్పులు, అభివృద్ధి చూసి చాలా ఆశ్చర్యపోతున్నానన్నారు. ఇదే వేగంతో భారత్‌ అభివృద్ధి సాధించాలని కోరుకుంటున్నానని సుందర్ పిచాయ్ అన్నారు.

ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిటే సాంకేతిక పరిజ్ఞానం అందిపుచ్చుకోవడంలో భారత్‌ మేదస్సు, సామర్ధ్యానికి, చురుకుదనానికి నిదర్శనం కదా?

ADVERTISEMENT
Latest Stories