తొలి టెస్ట్ లో సాధించిన విజయంతో రెండవ టెస్టు మ్యాచ్ లోనూ అదే రకమైన ఆటతీరుతో విండీస్ ను ఓటమి పాలు చేసేందుకు రోడ్ మ్యాప్ ని సిద్ధం చేసిన టీమిండియా ‘దూకుడు’కు వరుణుడు అడ్డంగా వచ్చాడు. మూడవ రోజు ఆటలో భారత్ స్కోర్ 500 పరుగులు చేరుకోవడంతో కెప్టెన్ కోహ్లి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసాడు. అప్పటికి రెహనే సెంచరీ పూర్తి చేసి 108 పరుగులతో నాటౌట్ గా ఉన్నాడు.
అయితే అప్పుడే వరుణుడు ప్రతాపం ప్రారంభమైంది. దీంతో మైదానంలోకి కవర్స్ రావడం, ఆటగాళ్ళు పెవిలియన్ కే పరిమితం కావడం జరిగిపోయాయి. మ్యాచ్ లో ఇంకా రెండు రోజుల సమయం మిగిలి ఉండగా, టీమిండియా 304 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ రెండు రోజుల్లో వర్షం కురవకపోతే విజయం టీమిండియాను వరించడం అత్యంత సులభమైన విషయంగా చెప్పవచ్చు. విండీస్ బ్యాట్స్ మెన్లు ఫాంలో లేకపోవడం ఒక విషయమైతే, వర్షం కురిసిన పిచ్ పైన భారత స్పిన్నర్ల దూకుడుని అడ్డుకోవడం అసాధ్యంగానే చెప్పవచ్చు.
ఇక, ఓవర్ నైట్ స్కోర్ 358/5 పరుగులతో ఆరంభించిన భారత బ్యాట్స్ మెన్లకు విండీస్ ఫీల్డర్లు సహకరించడంతో రెహనే కు అవకాశం లభించినట్లయ్యింది. మరో ఎండ్ లో ఉన్న కీపర్ సాహా అర్ధ సెంచరీ దిశగా పయనిస్తున్న సమయంలో 47 పరుగుల వద్ద అవుట్ కాగా, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన మిశ్రా 21, షమీ 0 వెనువెంటనే పెవిలియన్ బాట పట్టారు. ఈ తరుణంలో ఉమేష్ యాదవ్ సహకారంతో చెలరేగిన రెహనే సెంచరీ పూర్తి చేయగలిగాడు. అయితే 500 పరుగుల వద్ద ఉమేష్ యాదవ్ అవుట్ కావడంతో, కోహ్లి ఇన్నింగ్స్ ని డిక్లేర్ చేసాడు.



