భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అమెరికా సహా అనేక దేశాలు తమ ఉపగ్రహాల ప్రయోగాల కోసం ఇస్రో సేవలను వినియోగించుకుంటున్నాయి.
మంగళ్‌యాన్, చంద్రయాన్-1, 2, 3 వంటి విజయాలతో ప్రపంచవ్యాప్తంగా భారత మేధస్సుకు గుర్తింపు తీసుకొచ్చిన సంస్థగా ఇస్రో నిలిచింది. ప్రస్తుతం గగన్‌యాన్, చంద్రయాన్-4 వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులపై పని చేస్తోంది.
ఇంత గొప్ప సంస్థలో పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేయడం లేదా స్వచ్ఛంద పదవీ విరమణ కోరుతుండటం ఆలోచింపజేస్తుంది. ఆందోళన కలిగిస్తుంది.
గత ఏడాదిలో సుమారు 120 మంది వరకు శాస్త్రవేత్తలు రాజీనామాలు చేసినట్లు తెలుస్తోంది. వారిలో ఎల్‌వీఎం-3 (మార్క్-3) ప్రాజెక్ట్ డైరెక్టర్ విక్టర్ జోసఫ్‌తో పాటు గగన్‌యాన్ ప్రాజెక్టుకు సంబంధించిన పలువురు సీనియర్ శాస్త్రవేత్తలు, అధికారులు కూడా ఉన్నట్లు సమాచారం.
ఈ రాజీనామాలకు వారు వ్యక్తిగత కారణాలు చెబుతున్నప్పటికీ, ప్రైవేట్ రంగంలో కూడా అంతరిక్ష సంస్థలు ఏర్పాటవడం దీనికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. అవి ప్రవేశించిన తర్వాత ఈ రంగంలో పోటీ పెరిగింది. వాటిలో కొన్ని ఇస్రో మౌలిక సదుపాయాలను కూడా వినియోగించుకుంటున్నాయి.
స్కైరూట్, అగ్నికుల్ వంటి సంస్థలు రాకెట్ తయారీ, ప్రయోగాల దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాయి. ప్రైవేట్ సంస్థలు అధిక వేతనాలు, మెరుగైన సౌకర్యాలు, వేగంగా ఎదిగే అవకాశాలు కల్పిస్తుండటం కూడా కొందరు శాస్త్రవేత్తలను ఆకర్షిస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి తాజా ఉదాహరణలుగా హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ విక్రమ్-1 రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతుండటం, ఇస్రో మాజీ ఛైర్మన్ ఎస్. సోమనాథ్ ప్రైవేట్ స్పేస్ రంగంలో బాధ్యతలు స్వీకరించడం కనిపిస్తున్నాయి.
అయితే అమెరికా వంటి అగ్రదేశాలతో పోటీ పడిన ఇస్రో శాస్త్రవేత్తలు దేశీయ ప్రైవేట్ సంస్థలతో పోటీ పడటానికి, లేదా ఇస్రో పరిజ్ఞానాన్ని వారితో పంచుకోవడం ఇష్టపడకనో లేదా కెరీర్ అవకాశాలు, వేతనాలు, పరిశోధన స్వేచ్ఛ, సంస్థాగత వాతావరణం వంటివి పరిగణనలోకి తీసుకునో ఇస్రోని వీడుతుండవచ్చు.
కారణాలు ఏవైనా సరే, దశాబ్దాల అనుభవం ఉన్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేసి వెళ్ళిపోతే ఇస్రోకు, అది చేపడుతున్న గగన్‌యాన్, చంద్రయాన్-4 వంటి ప్రాజెక్టులపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుంది.
ఒకవేళ ఇస్రో కంటే ప్రైవేట్ రంగంలో మెరుగైన అవకాశాల వల్లనే వారు ఇందుకు సిద్ధపడుతున్నట్లయితే రెండు పరిణామాలు జరిగే అవకాశం ఉంది.
ప్రైవేట్ రంగంలో కూడా భారత అంతరిక్ష పరిశ్రమ శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కానీ సరిగ్గా ఇటువంటి పరిస్థితి ఎదురైనందుకే దేశంలోని పలు ప్రభుత్వరంగ సంస్థలు దెబ్బ తిన్నాయి. కనుక ఇస్రోకి కూడా అలాంటి ప్రమాదం పొంచి ఉంది.
ఇస్రో దేశ గౌరవానికి ప్రతీక. కనుక వారి రాజీనామాల వెనుక ఉన్న అసలు కారణాలను గుర్తించి, ఇస్రో శాస్త్రవేత్తలు చేజారిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది.




