మాలీవుడ్ లోనూ క్రేజ్ ఉన్న తెలుగు హీరో అల్లు అర్జున్. కేరళలో స్ట్రాంగ్ బేస్ ఉన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ మరోసారి తమ సత్తా చాటారు. ‘సరైనోడు’ సినిమా ‘యోధవు’గా మళయాళంలోకి డబ్ అయ్యి గత వారం విడుదల కాగా, యధావిధిగా బన్నీ సినిమాలకు బ్రహ్మరధం పట్టినట్లుగా, ఈ సినిమాకు కూడా అభిమానులు నీరాజనాలు పలికారు. దీంతో ఫిదా అయిన అల్లు అర్జున్ స్వయంగా మాలీవుడ్ అభిమానులను పలకరించాడు. హోరెత్తిన అభిమానుల మధ్య ఉన్న బన్నీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
బన్నీని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రేక్షకులు విచ్చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గత వారం విడుదలైన స్ట్రెయిట్ సినిమాల కంటే ఎక్కువగా ‘యోధవు’ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు ఖరారు చేసాయి. తొలి వీకెండ్ లో కోటిన్నర్ర వరకు రాబట్టిన బన్నీ సినిమా, వీక్ డేస్ లో కూడా హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దుమ్ము దులపడం విశేషం. చూడబోతుంటే ‘సరైనోడు’ సినిమా అల్లు అర్జున్ కెరీర్ ను మరో మలుపు తిప్పినట్లుగా ట్రేడ్ వర్గీయులు విశ్లేషిస్తున్నారు.
గతంలో ‘బద్రినాద్’ వంటి భారీ అంచనాలున్న బన్నీ సినిమాలు టాలీవుడ్ లో పరాజయం పాలైనా, మాలీవుడ్ లో మాత్రం మోత మోగించాయి. ఒక రకంగా మహేష్ కు ఓవర్సీస్ అభిమానుల మాదిరి మాలీవుడ్ లో అల్లు అర్జున్ అభిమానులు తయారైనట్లు కనపడుతోంది. ఇక నుండి బన్నీ సినిమాలు తెలుగు, మలయాళ భాషల్లో ఏక కాలంలో రూపుదిద్దుకున్నా ఆశ్చర్యం లేదనేటంతగా “యోధవు” సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.



