ప్రముఖ నిర్మాత దిల్‌రాజు చొరవ తీసుకోవడంతో అల్లు అర్జున్-సినీ పరిశ్రమ-తెలంగాణ ప్రభుత్వం మద్య వివాదం, అభిప్రాయ భేదాలు త్వరలో ముగిసేపోయే అవకాశం ఉంది. రెండు మూడు రోజులలో సినీ ప్రముఖులను వెంటబెట్టుకొని సిఎం రేవంత్ రెడ్డిని కలిసి అన్ని విషయాలు మాట్లాడుతామని దిల్‌రాజు నిన్ననే చెప్పారు. అంటే 2024 ముగిసేలోగానే ఈ వివాదం ముగియబోతోందన్న మాట.
ఈ వివాదం వలన అల్లు అర్జున్ ఒక్కరే కాదు.. అందరూ ఎంతో కొంత నష్టపోతూనే ఉన్నారు. తెలంగాణకు భారీగా ఆదాయం, పేరు ప్రతిష్టలు సంపాదించి పెడుతున్న సినీ పరిశ్రమని సిఎం రేవంత్ రెడ్డి ఈ వంకతో వేధించడం సరికాదని, బిఆర్ఎస్, ఢిల్లీలోని బీజేపి పెద్దలు కూడా విమర్శిస్తున్నారు.
Also Read – ‘ముద్రగడ’ పోయి…’జోగయ్య’ వచ్చారా.?
వారి విమర్శలలో వాస్తవం ఉంది. కనుక ఇక్కడితో ఈ వ్యవహారం ముగించాలని సిఎం రేవంత్ రెడ్డి కూడా కోరుకుంటున్నారని స్వయంగా దిల్‌రాజు చెప్పారు.
ప్రభుత్వంతో యుద్ధానికి దిగితే సినీ పరిశ్రమకు ఇటువంటి ఊహించని కష్టాలతో పాటు, భారీగా నష్టాలు వస్తాయని సినీ ప్రముఖులకు కూడా తెలుసు. కనుక వారు కూడా సిఎం రేవంత్ రెడ్డిని కలిసి వివరణ ఇచ్చుకొని ఈ సమస్యని పరిష్కరించుకోవాలని అనుకొంటున్నారు.
Also Read – పొత్తు లెక్కలు తప్పుతున్నాయా..?
అల్లు అర్జున్ విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి కక్ష, దురుదేశ్యం లేడని మంత్రి సీతక్క చెప్పారు. కనుక ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ తర్వాత ఇక అల్లు అర్జున్ జోలికి పోలీసులు, కాంగ్రెస్ మంత్రులు రాకపోవచ్చు.
కానీ ఇప్పటికే కేసు నమోదు చేసినందున ‘చట్టం తన పని తాను చేసుకుపోతుంది.’ పోలీసులు, అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు ఈ కేసు సంగతి చూసుకుంటారు. కనుక అల్లు అర్జున్ కూడా ఈ గొడవల నుంచి బయటపడి మళ్ళీ సినిమా పనులు చేసుకోవచ్చు.
Also Read – జగన్ మార్క్ రాజకీయాలు ఇలాగే ఉంటాయి మరి!
ముఖ్యమంత్రితో సినీ ప్రముఖులు భేటీ తర్వాత కూడా ప్రివిలేజ్ షోలకు ప్రభుత్వం అనుమతించే అవకాశం ఉండకపోవచ్చు. కానీ సంక్రాంతికి అదనపు షోలు వేసుకునేందుకు అనుమతించవచ్చు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటకు భంగం కలుగకుండా, అటు సినీ ప్రముఖుల అభ్యర్ధనని కొట్టి పడేయకుండా కొద్దిగా టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతించవచ్చు.
పుష్పరాజ్ స్టోరీ త్వరలో క్లైమాక్స్ చేరుకోబోతోంది. కనుక దానికి సీక్వెల్ అన్నట్లు వెంటనే ‘ఫార్ములా 1 రేసింగ్’ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఈ నెల 30వరకు కేటీఆర్‌ని అరెస్ట్ చేయవద్దని హైకోర్టు మద్యంతర ఉత్తర్వులు జారీ చేసింది కనుక కేటీఆర్‌ని అరెస్ట్ చేసేందుకు ఏసీబీ అధికారులు అవసరమైన సన్నాహాలు చేసుకొని ఓపికగా ఎదురుచూస్తున్నారు. కేటీఆర్ అరెస్ట్ అయితే బిఆర్ఎస్ పార్టీ నేతలు డిసెంబర్ 31న ‘హ్యాపీ న్యూఇయర్’ అని చెప్పుకొని ప్రయోజనం ఉండదేమో?