ఊళ్ళో పెళ్ళంటే కుక్కలకు హడావుడి అన్నట్లు తెలంగాణ సిఎం కేసీఆర్ తన టిఆర్ఎస్ పార్టీ పేరును బిఆర్ఎస్‌గా మార్చి జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లో ఆయనకు అభినందనలు తెలుపుతూ ఫ్లెక్సీ బ్యానర్లు పెట్టి మిటాయిలు పంచుకొంటున్నారు కొందరు రాజకీయ నిరుద్యోగులు.
అక్కడ కేసీఆర్ పేరు మార్చుతూ పార్టీ తీర్మానంపై సంతకం చేయగానే ఇక్కడ రాజమండ్రిలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ‘నా ఓటు బిఆర్ఎస్‌కే’ అని ప్రకటించేశారు. పార్టీ పేరు మార్పు కోసం టిఆర్ఎస్ నేతలు సమర్పించిన దరఖాస్తుని కేంద్ర ఎన్నికల కమీషన్ ఇంకా పరిశీలిస్తుండగానే ‘ఆలూ లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగమన్నట్లు…’ కోనసీమ జిల్లాలో బిఆర్ఎస్ పేరుతో రేవు అమ్మోజీరావు అనే వ్యక్తి ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ బ్యానర్ ఆడారి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ గులాబీ రంగు బ్యానర్‌లో ‘జై బోలో బిఆర్ఎస్… జైబోలో కేసీఆర్’ అంటూ నినాదం అచ్చు వేయించి దిగువన అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్ధిని నేనే అంటూ తన పేరు వేసుకొన్నారు. అమలాపురంలో గడియారపు స్తంభం సెంటరులో ఈ ఫ్లెక్సీ బ్యానర్లు ఈరోజు ఉదయం ప్రత్యక్షమయ్యాయి. అదిచూసి స్థానికులు విస్తుపోతున్నారు.
ఆంద్రా పాలకుల వలన తెలంగాణ ప్రజలకు తీరని అన్యాయం జరుగుతోందనే వాదనతో రాష్ట్ర విభజన చేయించారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం వలన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వాదిస్తూ ఢిల్లీపై దండయాత్రకు బయలుదేరుతున్నారు. అయితే ఆనాడు ఆంద్ర పాలకుల వలన, ఇప్పుడు కేంద్రం వలన తెలంగాణకు అన్యాయం జరుగుతోందని పోరాటానికి సిద్దమవుతున్న కేసీఆర్ గత 8 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం చేస్తూనే ఉన్నారు.
విభజన చట్టంలో పేర్కొన్నట్లు షెడ్యూల్ 9,10 ఆస్తుల పంపకాలకు అంగీకరించకుండా కోర్టులలో పిటిషన్లు వేసి అడ్డుకోంతునారు. అలాగే నదీ జలాల పంపకాలకు పేచీలు పెడుతూనే ఉన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పధకం, పోలవరం ప్రాజెక్టులపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఉద్యమ సమయంలో ఆంద్రులను ఆయన ఎంతగా అవమానించారో బహుశః అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. అటువంటి వ్యక్తి తన బిఆర్ఎస్ పార్టీకి ఓట్లేయమని అడగటానికి ఏపీకి వస్తుండటమే సిగ్గుచేటు. ఆనాడు ఆయన అంతగా అవమానించినా వాటన్నిటినీ మరిచిపోయిన ఇటువంటి కొందరు వ్యక్తులు ఆయన రాకముందే నిసిగ్గుగా జేజేలు పలుకుతున్నారు.