
కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా సిఎం చంద్రబాబు నాయుడుకి అమరావతి ప్లస్ పాయింట్‌గా, వైసీపీకి మైనస్ పాయింట్ అని చెప్పక తప్పదు. రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒకటే మాట మీద ఉండగా, జగన్ అనేక కప్పగంతులు వేశారు.
Also Read – నాగబాబు వ్యాఖ్యలు…వర్మకు కౌంటరా.?
అనేక సమస్యలు, సవాళ్ళు, అవరోధాలు, ఆర్ధిక పరిమితులను ఎదుర్కొంటూ చంద్రబాబు నాయుడు అమరావతిని నిర్మించడానికి ప్రయత్నిస్తుండగా, అన్నీ అమర్చిపెట్టినప్పటికీ జగన్ అమరావతిని నాశనం చేశారు. అందువల్లే అమరావతి గురించి వైసీపీ నేతలు మాట్లాడే నైతిక అర్హత కూడా కోల్పోయారని చెప్పక తప్పదు.
కనుక ఈ అంశంపై మాట్లాడితే ప్రజల దృష్టిలో వైసీపీ పట్ల మరింత ఏహ్యత పెరుగుతుందే తప్ప తగ్గదు. ఈ భయంతోనే జగన్ ఎన్నడూ అమరావతి ప్రస్తావన చేయకుండా జాగ్రత్తపడుతున్నారని చెప్పవచ్చు.
Also Read – ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
కానీ ఏపీ రాజకీయాలలో చాలా సీనియర్ నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సోమవారం మండలిలో అమరావతి గురించి మాట్లాడి మంత్రి అచ్చనాయుడుకి అడ్డంగా దొరికిపోయారు.
“చంద్రబాబు నాయుడుపై ద్వేషంతోనే జగన్ అమరావతిని పాడుబెడుతుంటే, దాని వలన రాష్ట్రానికి చాలా నష్టం జరుగుతుందని తెలిసి ఉన్నప్పటికీ ఇంత రాజకీయ అనుభవం ఉన్న మీరెందుకు వారించలేదు?” అని మంత్రి అచ్చన్నాయుడు సూటిగా ప్రశ్నించారు. దానికి బొత్స సమాధానం చెప్పలేకపోయారు.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
ఇదివరకు ఆయన కూడా జగన్‌కి వంతపాడుతూ అమరావతిని శ్మశానంతో పోల్చడాన్ని అచ్చన్నాయుడు గుర్తుచేసి, “మీరందరూ ఆ శ్మశానంలోనే కట్టిన ఈ భవనాలలోనే కూర్చొని 5 ఏళ్ళు పాలన సాగించారు కదా?ఈ తాత్కాలిక భవనాలకు మేము అవసరానికి మించి ఖర్చు చేశామని వాదిస్తున్న మీకు, ఋషికొండపై వందల కోట్లు ఖర్చు చేసి నిర్మించుకున్న ప్యాలస్‌లు కనిపించడం లేదా?
ఈ సచివాలయం, శాసనసభ, హైకోర్టు భవనాలు కట్టిన రోజు నుంచి నేటి వరకు వాడుకుంటున్నాము. కానీ ఋషికొండపై జగన్ కట్టించుకున్న విలాసవంతమైన ప్యాలస్‌లు వాడుకోలేక నిరుపయోగంగా పడున్నాయి కదా?” అంటూ అచ్చన్నాయుడు ప్రశ్నించారు.
ఆయనకు బొత్స ఏదో సమాధానం చెప్పి తప్పించుకోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు రాష్ట్రం కోసం రాజధాని అమరావతి నిర్మిస్తుండగా, జగన్ వాటన్నిటినీ నాశనం చేసేందుకు ప్రయత్నించారని, పైగా ప్రజాధనం విచ్చలవిడిగా ఖర్చుచేసి తన కోసం ప్యాలస్‌లు నిర్మించుకున్నారని మరోసారి ఈ చర్చతో ప్రజలకు గుర్తు చేసినట్లయింది కదా? కనుక అమరావతి గురించి వైసీపీ నేతలు ఎంత తక్కువ మాట్లాడితే అంత వారికే మంచిది.
ఇకపై రాజధాని అమరావతిపై వైసీపీ వైఖరి ఏమిటో చర్చించుకుని నిర్ణయించుకోవడం కూడా చాలా అవసరమే. లేకుంటే ఇలాగే ప్రతీసారి అడ్డంగా దొరికిపోతుంటారు.