వైసీపీ గ్రహణం వీడిన అమరావతి కూటమి రాకతో నిర్మాణాల దిశగా పరుగులు పెడుతుంది. ఇందుకోసం ఇప్పటికే అమరావతిలో 80 వేలకోట్ల పనులకు గాను ప్రభుత్వం టెండర్లను ఆహ్వానించింది, పనులను సైతం ప్రారంభించింది.
అయితే ముందుగా ప్రభుత్వ భవనాలు, రోడ్లు – డ్రైనేజ్ నిర్మాణాలు, వరద నియంత్రణ చర్యలు, ఐకానిక్ భవనాల సముదాయాలు…ఇలా ప్రభుత్వానికి సంబంధించిన అన్ని నిర్మాణాలను పూర్తి చేసేందుకు ప్రభుత్వం శాయశక్తులు ఒడ్డుతుంది.
అలాగే రాజధాని అమరావతిలోనే నివాసం ఉండేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తన సొంతింటి నిర్మాణాన్ని మొదలు పెట్టారు. అయితే రాజధానిగా అమరావతి వెలగడానికి ఈ నిర్మాణాలు సరిపోతాయా అంటే ఖచ్చితంగా కాదనే చెప్పాలి.
ఇప్పటి వరకు బాబు ప్రభుత్వం అమరావతిలోని ప్రభుత్వ నిర్మాణాల మీదే ఎక్కువగా శ్రద్ద పెడుతూ వస్తుంది. అంటే అమరావతి భౌతిక రూపం మీద ఎక్కువగా ఫోకస్ పెట్టిన బాబు ఆ ప్రాంత అంతర్గత వసతుల మీద కూడా ద్రుష్టి పెట్టాలి.
అందులో భాగంగా అమరావతిలో కుటుంబాల నివాసానికి అవసరమైన అన్ని వసతులను సమకార్చాలి. ఉదాహరణకు 2026 నాటికీ అమరావతిలో ప్రభుత్వాధికారులకు నివాస కోర్టర్స్, ప్రజాధిపతులకు వసతి గృహాలు అందుబాటులోకి తేనుంది కూటమి ప్రభుత్వం.
అయితే వారు కుటుంబాలతో సహా అక్కడికొచ్చి నివసించేందుకు అనువుగా వారి పిలల్లకు అవసరమైన పాఠశాలలు, కళాశాలలు, వైద్య సదుపాయాలు, మాల్స్, సూపర్ మర్కెట్స్, క్రీడా మైదానాలు ఇలా ప్రజా జీవనం సౌకర్యవంతముగా,భద్రంగా ముందుకు సాగేందుకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలి.
అయితే ప్రస్తుతానికి ఇటువంటి మౌలిక అవసరాల కోసం ఆయా ప్రాంతల ప్రజలు ఇప్పటికి విజయవాడ లేదా గుంటూరు వంటి పొరుగు నగరాలను ఆశ్రయిస్తున్నారు. అలాకాకుండా అమరావతిలోనే ఈ సౌకర్యాలన్నిటిని ప్రభుత్వం అభివృద్ధి చెయ్యగలిగితే అమరావతి అతి తొందరలోనే ప్రజా రాజధానిగా వెలుగొందుతుంది.
రాజధానికి ఆర్భాట హంగులు ఎంత అవసరమో కనీస సౌకర్యాలు అంతే అవసరం. ముఖ్యంగా రాజధానికి అన్ని ప్రాంతాలతో కనెక్టివిటీ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలి. అలాగే ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటుగా అత్యవసర సేవలకు అవసరమైన అన్ని వసతులను సమకూర్చాలి.
ఇవన్నీ సమకూర్చడం చాల వ్యయప్రయాసలతో కూడినదే అయినప్పటికీ దీనికి రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధితో పాటుగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సాయం కూడా అత్యవసరం. కూటమి ప్రభుత్వం రానున్న రోజులలో ఈ సమస్యల పరిష్కారం మీద ఎక్కువగా ద్రుష్టి పెడితే భవిష్యత్ లో అమరావతి మరో హైద్రాబాద్ అవుతుంది.




