
ఇదివరకు అంటే 2014 లో చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయినప్పుడు రాజధాని అమరావతి నిర్మాణం కోసం చాలా కసరత్తు చేసింది. భూసేకరణ, కేంద్రం నుంచి అనుమతులు, ప్లానింగ్, డిజైనింగ్, అంతర్గత రోడ్ల నిర్మాణాల వంటి అనేక క్లిష్టమైన పనులన్నీ పూర్తిచేసి అనేక భవనాలను కూడా నిర్మించింది.
చంద్రబాబు నాయుడు అమరావతి నిర్మాణం తలపెట్టి, చకచకా నిర్మాణ పనులు జరిపిస్తున్నప్పుడు సచివాలయం, హైకోర్టు తదితర భవనాలను పదేపదే తాత్కాలిక కట్టడాలని చెప్పుకోవడం, అమరావతి డిజైన్లని మీడియాకు విడుదల చేయడం, రాజమౌళిని పిలిపించి వాటి గురించి మాట్లాడటం, పదేపదే సింగపూర్, విదేశాలకు వెళ్ళి వస్తుండటం వంటివన్నీ ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపాయని చెప్పొచ్చు .
Also Read – రఘురామని కూడా బాబు కాపాడుకున్నారు.. మరి వంశీని?
వాటన్నిటినీ వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకొని చంద్రబాబు నాయుడు అమరావతి పేరుతో టీడీపీ నేతలందరూ భారీగా అవినీతికి పాల్పడ్డారని, ప్రజలను మభ్యపెట్టేందుకు చంద్రబాబు నాయుడు అమరావతి గ్రాఫిక్స్ చూపిస్తున్నారంటూ వైసీపీ చేసిన వాదనలు అమరావతి పాలిట శాపంగా మారాయి. ఆ తర్వాత టీడీపీ-బీజేపిలు విడిపోవడం, గొడవలతో ఒక్కసారిగా పరిస్థితులు తారుమారు అయ్యాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యారు.
ఒకవేళ కూటమి ప్రభుత్వం మరో 5 ఏళ్ళు అధికారంలో కొనసాగి ఉన్నా లేదా జగన్ ఆ పనులను అంటే వేగంగా కొనసాగించి ఉన్నా ఈపాటికి అమరావతికి రూపు రేఖలు వచ్చి ఉండేవి. కానీ జగన్ ఆ పనులను నిలిపివేయడమే కాకుండా, అక్కడ రాజధాని నిర్మించకుండా అడ్డుకునేందుకు చేయకూడని పనులన్నీ చేసిపోయారు. కనుక అమరావతి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చిన్నట్లయింది.
Also Read – బొత్సగారు.. మీ అనుభవమే వృధా అవుతోంది!
ఇప్పుడు చంద్రబాబు నాయుడు మళ్ళీ అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే 40 పనులకు టెండర్లు పిలిచామని, ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభం కాబోతున్నాయని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ చెప్పారు.
మూడేళ్లలోగా అంటే 2028 లోగా అమరావతి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతి గురించి ప్రజలకు తెలియజేయడం చాలా అవసరమే. కానీ ఇదివరకు అతిగా చెప్పుకున్నందుకు, అతిగా ప్రచారం చేసుకున్నందుకు ఎంత నష్టం జరిగిందో, ఎంత అప్రదిష్టపాలయ్యారో మంత్రి నారాయణకు బాగా తెలుసు. కనుక అమరావతి గురించి తక్కువ మాట్లాడుతూ ఎక్కువ పనులు పూర్తిచేయడం చాలా మంచిది.