అమరావతిలో రైతులు సుమారు మూడేళ్ళుగా ఆందోళనలు చేస్తున్నది ఎవరి కోసం?తమ భూములు తమకి తిరిగిమ్మని వారు అడగడం లేదు. తాము ఇచ్చిన భూములను ప్రభుత్వం అమ్మేసుకోకుండా రాజధాని అమరావతి నగరాన్ని నిర్మించాలని మాత్రమే వారు కోరుతున్నారు.
వారు రాష్ట్ర భవిష్యత్‌కు సంబందించిన అమరావతి కోసం పోరాడుతున్నారు కనుకనే టిడిపి, జనసేన, కాంగ్రెస్, బిజెపి, వామపక్షాలు మద్దతు ఇస్తున్నాయి. కానీ ఎట్టి పరిస్థితులలో పరిస్థితులలో అమరావతి నిర్మించకూడదని వైసీపీ ప్రభుత్వం ఫిక్స్ అయినందున, రాజధాని కోసం భూములిచ్చిన రైతులనే దోషులుగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తుండటం చాలా దారుణం. వారి పోరాటాలు, మహాపాదయాత్ర అన్నీ ఫేక్ అని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు.
రాజధాని కోసం భూములిచ్చిన రైతులే అమరావతి కోసం పోరాడుతుంటే వైసీపీ ప్రభుత్వం వారి పోరాటాలను తెలుగుదేశం ‘స్పాన్సర్డ్’ అని ముద్రవేయడం సిగ్గుచేటు. తద్వారా వారు అమరావతి కోసం కాక టిడిపి కోసం మాత్రమే పోరాడుతున్నారనే దురభిప్రాయం ప్రజలలో కల్పించి వారికి మద్దతు తెలుపకుండా ఏకాకులుగా చేయాలనే దురాలోచన కనబడుతోంది.
ప్రభుత్వం పట్టించుకోకపోయినా, అంబటి రాంబాబు వంటివారు అవహేళనగా మాట్లాడుతున్నా, పోలీసులు అక్రమకేసులతో వేదిస్తున్నా వారి పోరాటం మానుకోలేదు. వారి పోరాటం.. అమరావతి కోసం వారి ఆరాటం, నిబద్దత ప్రజలకు అర్దమవుతూనే ఉన్నాయి. కనుకనే గత ఏడాది నవంబర్-డిసెంబర్ నెలల్లో వారు అమరావతి నించి తిరుపతికి చేసిన మహాపాదయాత్రలో ఊరూరా ప్రజలు నీరాజనాలు పట్టారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్ని అవరోదాలు సృష్టించిన్నప్పటికీ మళ్ళీ మరో మహా పాదయాత్రకు బయలుదేరుతున్నారు. ఈసారి అమరావతి నుంచి శ్రీకాకుళం వరకు మహా పాదయాత్ర చేయబోతున్నారు. ముందుగా వారు వెంకటపాలెంలోని శ్రీ వేంకటేశ్వరస్వామిలో ఆలయంలో ప్రత్యేకపూజలు చేసి మహా పాదయాత్రకు అంకురార్పణ చేశారు. అనంతరం ఉదయం 9 గంటలకు పాదయాత్ర ప్రారంభించారు. ఈసారి మహాపాదయాత్రలో శ్రీ వేంకటేశ్వరస్వామివారి రధాన్ని వారు తమతో తీసుకొని వస్తున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి, రైతు ఐకాసల నేతలు, టిడిపి మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొని జెండా ఊపి మహాపాదయాత్రను ప్రారంభించారు.



