అప్పుడు మమ్మల్ని ఇప్పుడు మిమ్మల్ని… ఓట్ల కోసమే మోసం!

Amaravati-Farmers-Protest-against-Jaganరాజధాని అమరావతి వివాదం ఇంకా సుప్రీంకోర్టులో ఉండగానే నేడు సిఎం జగన్మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలోని కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్‌‌లో పేదలకు కేటాయించిన సెంటు భూములలో ఇళ్ళ నిర్మాణాలకు శంకుస్థాపన చేయబోతున్నారు.

ఈరోజు ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి ప్యాలస్‌ నుంచి హెలికాఫ్టర్‌లో బయలుదేరి కృష్ణాయపాలెం చేరుకొని ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో వెంకటపాలెం చేరుకొని అక్కడ సభలో లబ్ధిదారులకు ఇళ్ళపత్రాలు పంపిణీ చేస్తారు. బహిరంగసభలో ముగిసిన తర్వాత హెలికాఫ్టర్‌లో తాడేపల్లి ప్యాలస్‌ చేరుకొంటారు.

ADVERTISEMENT

అమరావతి కోసం ఆందోళనలు చేస్తున్న రైతులు నల్ల జండాలు, నల్ల బెలూన్లతో నిరసన తెలుపుతున్నారు. దీంతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండటంతో భారీగా పోలీసులను మోహరించారు. తమ నిరసనలు ఎదుర్కోవలసి ఉంటుందనే భయంతోనే సిఎం జగన్‌ కేవలం 6-7 కిమీ దూరానికి హెలికాఫ్టర్‌లో తిరుగుతున్నారని ఆందోళనలు చేస్తున్న రైతులు ఆక్షేపించారు.

ఈ సందర్భంగా రాజధాని రైతులు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, “ఆనాడు అమరావతే రాజధానిగా ఉంటుందని చెప్పి అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అంటూ మాట మార్చి జగన్‌ మమ్మల్ని మోసం చేశారు. ఇప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న వివాదాస్పద భూములను పేదలకు పంచి వారిని కూడా మోసం చేస్తున్నారు.

అమరావతి అంశం కారణంగా రాబోయే ఎన్నికలలో ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో వైసీపీకి ఓట్లు పడవని గ్రహించి, బయట నుంచి జనాలను తీసుకువచ్చి ఇక్కడ భూములు పంచి, ఇళ్ళు కటిస్తామని మభ్యపెడుతూ ఓటు బ్యాంక్ సృష్టించుకొనేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు. కాదంటే, ఈ స్థలాలు, వాటిలో నిర్మిస్తున్న ఇళ్ళకు తన ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుందని వారికిచ్చే పత్రాలలో జగన్‌ హామీ ఇవ్వగలరా?అని ప్రశ్నించారు.

జగన్‌ తన పార్టీ రాజకీయ అవసరాల కోసమే ఎక్కడో నివాసం ఉంటున్న పేద ప్రజలను తీసుకువచ్చి ఇక్కడ భూములు ఇస్తున్నారని ఆరోపించారు. ఒకవేళ వారందరూ ఇక్కడకి వచ్చి స్థిరపడితే వారికి జగన్ ప్రభుత్వం ఉద్యోగాలు, ఉపాధి చూపించగలదా? అని రాజధాని రైతులు ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ తన కోసం వందల ఎకరాలలో విలాసవంతమైన ప్యాలస్‌లు నిర్మించుకొంటూ పేదలకు కేవలం సెంటు భూమిలో ఇళ్ళు సరిపోయాయనడం వారిని అవమానించడం కాదా? అని ప్రశ్నించారు.

తాడేపల్లి ప్యాలస్‌ నుంచి ఆరేడు కిమీ దూరంలో ఉన్న కృష్ణాయపాలెం, వెంకటపాలెంకు జగన్‌ హెలికాఫ్టర్‌లో వెళుతుండటాన్ని కూడా వారు తప్పు పట్టారు. అమరావతి విషయంలో రైతులను మోసం చేశాననే అపరాధ భావన, జగన్‌లో ఉండబట్టే తమకు మొహం చూపించలేక హెలికాఫ్టర్‌లో తప్పించుకొని తిరుగుతున్నారని రైతులు ఆక్షేపించారు. ఇప్పుడు గాలిలో ఎగురుతున్న జగన్మోహన్ రెడ్డిని వచ్చే ఎన్నికలలో రాష్ట్ర ప్రజలు తప్పకుండా నేలమీదకు దించుతారని అమరావతి రైతులు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories