ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతే… రాజముద్ర వేయాల్సిందే!

Amaravati Official Capital of Andhra Pradesh

కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం 2014లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని రెండుగా విడదీసినప్పుడు, ఏపీ, ఏపీ కాంగ్రెస్‌ పార్టీ నష్టపోయినా పరవాలేదు.. తెలంగాణలో కాంగ్రెస్‌ లాభపడితే చాలనుకుంది. అందువల్లే రాజధాని విషయంలో కూడా ఏపీకి తీరని అన్యాయం చేసింది.

నిజానికి విభజన ప్రక్రియ మొదలుపెట్టినప్పుడే లేదా విభజన పూర్తయిన తర్వాత ఏపీలో రాజధాని ఏర్పాటుకి అవసరమైన మౌలిక వసతులున్న ఓ నగరాన్ని ఎంపిక చేసి ఖరారు చేసి ఉండొచ్చు. దానికి భారీగా నిధులు కేటాయించి రాజధానిగా అభివృద్ధి చేసి ఉండొచ్చు.

ADVERTISEMENT

కానీ పదేళ్ళపాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని ప్రకటించేసి చేతులు దులుపుకుంది. దాని వలన రాష్ట్ర విభజన తర్వాత ఎన్ని ప్రోటోకాల్, రాజకీయ సమస్యలు ఎదురయ్యాయో అందరికీ తెలుసు.

అందువల్లే సిఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వ కార్యాలయాలను, సిబ్బందిని విజయవాడ తరలించేశారు. అందుకు అప్పుడు ఆయన అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ అది చాలా మంచి నిర్ణయమని తర్వాత అందరికీ తెలిసి వచ్చింది.

మన రాష్ట్రంలో మనం ఉంటేనే బిఆర్ఎస్ పార్టీ నేతలు చాలా చులకనగా మాట్లాడుతుంటారు. అదే.. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళు హైదరాబాద్‌లోనే ఏపీ ప్రభుత్వం ఉంటే?

నాడు ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించి తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కాపాడితే, విభజన తర్వాత ఏపీ ప్రభుత్వాన్ని విజయవాడకు తరలించి సిఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రుల ఆత్మ గౌరవం కాపాడారని చెప్పవచ్చు.

ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతిని ప్రారంభించగా, జగన్‌ దానిని నిర్ధాక్షిణ్యంగా పాడుబెట్టేశారు. ఎందువల్ల అంటే చంద్రబాబు నాయుడుపై ద్వేషంతోనే అని అందరికీ తెలుసు. కానీ ఏపీకి అమరావతే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం నిర్దిష్టంగా పేర్కొనకపోవడం కూడా ఓ కారణమే.

పదేళ్ళ పాటు హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉంటుందని కేంద్రం, నిర్ణయించగలిగినప్పుడు, ఏపీ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు అమరావతి ఆంధ్రప్రదేశ్‌ రాజధానిగా ఉంటుందని ఖరారు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల చేయవచ్చు. అవసరమైతే రాజ్యాంగంలో విభజిత ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబందించిన చట్టాలలో సవరణ చేసి అమరావతిని రాజధానిగా చేర్చవచ్చు.

ఒకవేళ ఆనాడు అమరావతి మాత్రమే ఆంధ్రాకు రాజధానిగా ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండీగా ప్రకటించి ఉన్నా లేదా ప్రధాని మోడీ జగన్‌కి గట్టిగా చెప్పినా నేడు అమరావతిని పునః ప్రారంభించుకోవలసిన అవసరమే ఉండేది కాదు.

గతం గతః.. అని వదిలేసినా ఒకవేళ రేపు మళ్ళీ ఎప్పుడైనా జగన్‌ అధికారంలోకి వస్తే అమరావతిని రాజధానిగా అంగీకరించకపోతే?మళ్ళీ విశాఖ రాజధాని పాట పాడితే?అనే ప్రశ్న అందరిలోనూ ఉంది.

కనుక కేంద్రం చేతే అమరావతిని రాజధానిగా ఖరారు చేయించి, అవసరమైతే రాజ్యాంగ సవరణ చేయించి పార్లమెంట్ చేత ఆమోదముద్ర వేయించాలని రాజధాని రైతులు సిఎం చంద్రబాబు నాయుడుని కోరారు.

జగన్‌ మళ్ళీ అధికారంలోకి వస్తారా రారా?అనే విషయం పక్కన పెట్టి చూస్తే, ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి మాత్రమే అని కేంద్రం చేత అధికారిక ప్రకటన చేయించాల్సిన అవసరం ఉందని సిఎం చంద్రబాబు నాయుడు కూడా గ్రహించారు. దీని గురించి ప్రధాని మోడీని కోరుతానని సిఎం చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు.

ADVERTISEMENT
Latest Stories