
విభజన తర్వాత తెలంగాణ ధనిక రాష్ట్రంగా అవతరించగా, ఆంధ్రప్రదేశ్ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉండేది. సచివాలయ ఉద్యోగులు హైదరాబాద్‌లో ఉండిపోవడంతో కనీసం పరిపాలన కూడా చాలా కష్టంగా ఉండేది. అయినప్పటికీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు ఒక్కో సమస్య పరిష్కరించుకుంటూ రాజధాని అమరావతి నిర్మాణ పనులు మొదలుపెట్టడం చూసి అందరూ పెదవి విరిచారు.
Also Read – ఊరిస్తూనే…ఉసురుమనిపిస్తుందే..!
ముఖ్యంగా జగన్, కేసీఆర్ ఇది ఊహించలేకపోవడంతో షాక్ అయ్యారు. ఆ తర్వాత అమరావతికి అడుగడుగునా అనేక అవరోధాలు, సమస్యలు, సవాళ్ళు అన్నిటినీ చంద్రబాబు నాయుడు నిబ్బరంగా ఎదుర్కొంటూ ముందుకే సాగారు. అనేక నిర్మాణాలు చేశారు కూడా.
ఆ కారణంగా ప్రజలలో అమరావతి సెంటిమెంట్‌గా మారింది. అది గుర్తించినందునే జగన్ అమరావతికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడలేదు. పైగా తాను కూడా అక్కడే ఇల్లు కట్టుకొని స్థిరపడతానని ప్రజలను నమ్మించారు. తర్వాత కధ అందరికీ తెలిసిందే.
Also Read – పడి లేచిన కెరటం .. జనసేన ..
అమరావతి నిర్మాణం పూర్తవకపోయినా అది అక్కడే ఏర్పాటవుతుందని పారిశ్రామికవేత్తలకు, ఐటి కంపెనీలకు గట్టి నమ్మకం కలిగితే వారందరూ హైదరాబాద్‌ని కాదని అమరావతికి తరలిపోతారని కేసీఆర్ భావించారు.
కనుక హైదరాబాద్‌ని మరింత అభివృద్ధి చేసుకోవాలని ప్రయత్నిస్తూనే అమరావతిని, దాంతో పాటు చంద్రబాబు నాయుడుని కూడా దెబ్బ తీయడానికి జగన్‌తో చేతులు కలిపారు. ఎప్పటికైనా ముఖ్యమంత్రి కావాలని తహతహలాడుతున్న జగన్, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని తన కల నెరవేర్చుకున్నారు.
Also Read – ఆంధ్ర అంటే ఇంకా నామోషీయేనా కేటీఆర్‌జీ?
కానీ అమరావతిని, చంద్రబాబు నాయుడుని దెబ్బతీయాలనుకున్న జగన్, కేసీఆర్ ఇద్దరూ దెబ్బైపోయారు. ఇప్పుడు వారి కళ్ళ ముందే మళ్ళీ అమరావతి నిర్మాణం జరుగబోతోంది. వారి కళ్ళ ముందే అమరావతికి, యూనివర్సిటీలు, ఐటి కంపెనీలు, స్టార్ హోటల్స్, దేశవిదేశాలకు చెందిన ఐటి కంపెనీలు, వాణిజ్య సంస్థలు వగైరా రాబోతున్నాయి.
అమరావతిలో ఈ అభివృద్ధిని చూసి జీర్ణించుకోవడం వారిద్దరికీ చాలా కష్టమే. కానీ ఇప్పుడు వారికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా లేవు. కనుక ఇద్దరూ మౌనంగా ఈ కడుపు మంట భరించాల్సిందే.
అయితే జగన్ కంటే కేసీఆర్‌కి ఈ కడుపు మంట మరింత ఎక్కువగా ఉంటుంది. తాను ఎంతగానో అభివృద్ధి చేశానని చెప్పుకున్న తెలంగాణ రాష్ట్రాన్నితన కళ్ళ ముందే రేవంత్ రెడ్డి భ్రష్టు పట్టించేస్తున్నారని ప్రతీరోజూ విమర్శిస్తూనే ఉన్నారు. సరిగ్గా ఇదే సమయంలో చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ ప్రమాణాలతో అమరావతి నిర్మిస్తున్నారు.
తిరుగే లేదనుకున్న తాను విడపోతే, తాను అమితంగా ద్వేషించే చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. కేంద్రంలో చక్రం తిప్పుతానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. కానీ చంద్రబాబు నాయుడు ఒక్క ముక్క కూడా మాట్లాడకుండానే కేంద్రంలో చక్రం తిప్పుతున్నారు. ఏపీకి అన్నీ సాధించుకుంటున్నారు. కనుక కేసీఆర్ కడుపు మంట చల్లార్చడానికి ఏ ట్యాబ్లెట్ సరిపోదేమో?