ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో కూటమి ప్రభుత్వం మొదటి నుంచి ఒకే మాటకు కట్టుబడి ఉంది. కానీ మాట తప్పనని చెప్పుకునే జగన్ మాత్రం తరచూ మాట మారుస్తూనే ఉన్నారు. కానీ ఆ విధంగా కూడా తాము అమరావతిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామనే విషయం ప్రజలు గ్రహించేలా చేస్తున్నారు. కనుక ‘అమరావతికి వైసీపీ వ్యతిరేకం’ అని పూర్తి స్పష్టత ఇచ్చినట్లే.
అమరావతి విషయంలో వైసీపీ ఈవిధంగా స్పష్టత ఇస్తుంటే, కూటమి ప్రభుత్వం కూడా మరింత స్పష్టత ఇస్తుండటం విశేషం. శాసనసభలో అమరావతి రాజధాని అని తీర్మానం మొదలు పార్లమెంటులో చట్ట సవరణ, రాష్ట్రపతి దానికి ఆమోదముద్ర వేయడం వరకు ప్రతీ విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.
నెల రోజులు ఆగితే నాలుగు చినుకులు పడితే అమరావతి మునిగిపోతుందని వైసీపీ నేత పేర్ని నాని శాపనార్థాలు పెడుతున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓ జీవో జారీ చేసింది. అది అమరావతి పట్ల కూటమి ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని చాటి చెపుతోంది.
ఆ జీవోలో అన్ని ప్రభుత్వ శాఖలు, కార్యాలయాలు, వాటి అధిపతులను ఉద్దేశ్యించి, రోజువారి ఉత్తర ప్రత్యుత్తరాలలో కొంతమంది అధికారులు ఇంగ్లీషులో అమరావతి స్పెల్లింగ్ ‘Amaravathi’ అని తప్పుగా వ్రాస్తున్నారని, కనుక అందరూ సరైన స్పెల్లింగ్ ‘Amaravati’ అని వ్రాయాలని సూచించింది.
భారతీయ భాషలలోని పదాలను ఇంగ్లీషులో వ్రాసేటప్పుడు ఇలాంటి పొరపాటు జరుగుతూనే ఉంటుంది. వాటిని చాలా మంది పట్టించుకోరు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంగ్లీషులో అమరావతి స్పెల్లింగ్‌లో ఒక్క అక్షరం కూడా తప్పు ఉండకూడదని స్పష్టం చేయడం, దాని కోసం జీవో జారీ చేయడం చాలా అభినందనీయం.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ప్రజల ఆత్మగౌరవానికి, ప్రతిష్టకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడుతున్న లక్షల కోట్లు విలువ చేస్తే అమరావతి మునిగిపోవాలని వైసీపీ కోరుకుంటుంటే, కూటమి ప్రభుత్వం అమరావతి పేరులో కూడా చిన్న అక్షర దోషం ఉండరాదని కోరుకుంటోంది. అమరావతి విషయంలో కూడా వైసీపీ, కూటమి ప్రభుత్వానికి ఇంత తేడా ఉంది మరి!




