మళ్ళీ మొదలుపెట్టేసిన అంబటి!

Ambati Rambabuజనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ శుక్రవారం భీమవరం సభలో వైసీపీ నేతలకు అంత గట్టిగా వార్నింగ్ ఇచ్చిన 24 గంటలలోగానే మంత్రి అంబటి రాంబాబు మళ్ళీ మొదలుపెట్టేశారు. గుంటూరులో ఆయన మీడియా సమావేశం ఏర్పటు చేసి మాట్లాడుతూ, “పవన్‌ కళ్యాణ్‌ రాజకీయాలకు పనికిరాడని తన వారాహి యాత్రతో మరోసారి నిరూపించుకొన్నారు.

ఆయన లోకోద్ధారకుడట… మేమంతా రౌడీలు, గూండాలమట! రాజకీయాలలో రౌడీయిజం చేస్తూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్న ఆయన విప్లవకారుడట. పదిమంది విప్లవకారుల పేర్లు గడగడా చెప్పేస్తే విప్లవకారుడైపోతారా ఎవరైనా?ఇంతకీ ఆయన ఏ విప్లవంలో పాల్గొన్నారో చెప్పాలి. వరుసగా మూడు పెళ్ళిళ్ళు చేసుకొని విప్లవం సృష్టించారంటే ఒప్పుకొంటాను. వివాహ వ్యవస్థ గురించి నీకు అవగాహన లేదు. ఇక నువ్వు సమాజాన్ని ఏమి ఉద్దరిస్తావు?

ADVERTISEMENT

ఢిల్లీ పెద్దలతో నాకు మంచి పరిచయాలున్నాయని మా గురించి అన్నీ నాకు తెలుసంటూ మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నావు. నీకు వారితో పరిచయాలు ఉంటే వెళ్ళి మాపై ఫిర్యాదులు చేసుకో. రాష్ట్రానికి, ప్రజలకు మేలు చేయడం తప్ప ఏ తప్పు చేయని మేమేందుకు నీ బెదిరింపులకు భయపడాలి?

మేము రాష్ట్రానికి, ప్రజాలకు మేలు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక అసూయతో నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నావు. కానీ నువ్వొచ్చి చేస్తున్నదేమిటి?ప్రశాంతంగా ఉండే గోదావరి జిల్లాలలో ప్రజల మద్య కులం పేరుతో చిచ్చుపెట్టేందుకు ప్రయత్నించావుగా.

ఏపీలో వైసీపీ వద్దంటున్నావు. మరైతే ఎవరు కావాలో కూడా నువ్వే చెప్పు. చంద్రబాబు నాయుడుని ముఖ్యమంత్రి చేసేందుకే ఈ మాటలన్నీ?నువ్వేదో ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతునన్నావు. ఇంతకీ ఎవరితో నీ పోరాటం? హాయిగా సినిమాలు చేసుకొని కోట్లకు కోట్లు సంపాదించుకొంటున్నావు.

అప్పుడప్పుడు ఇలా వారాహి వేసుకువచ్చి తిరుగుతూ రౌడీయిజం చేస్తుంటావు. ఇదేనా నీ పోరాటం. నువ్వు పుట్టక ముందు నుంచి నేను రాజకీయాలలోనే ఉన్నాను కానీ నేనేమీ పోరాటాలు చేయలేదు. అయినా రాజకీయాలలో పోరాటాలు దేనికి?” అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా సెటైర్లు వేశారు.

అంబటి రాంబాబు చాలా తెలివిగా మాట్లాడానని అనుకొంటున్నారేమో కానీ పవన్‌ కళ్యాణ్‌ చెప్పిన మాటలేవీ ఆయన చెవికి ఎక్కలేదని అర్దమవుతోంది. విప్లవకారుల స్పూర్తితో తాను రాజకీయాలలోకి ప్రవేశించానని చెప్పారే కానీ తాను విప్లవలలో పాల్గొన్నానని చెప్పలేదు.

వైసీపీ నేతలు తన వ్యక్తిగత విషయాలు మాట్లాడటం మానుకోవాలని పవన్‌ కళ్యాణ్‌ హెచ్చరించారు. కానీ అంబటి రాంబాబు మళ్ళీ అదే మాట్లాడారు. ప్రజలను పీడిస్తున్న వైసీపీని ఓడించాలని, జనసేనకు అవకాశం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వైసీపీ కూడా టిడిపి, జనసేనలను నమ్మవద్దని మళ్ళీ తమనే గెలిపించాలని వైసీపీ కూడా కోరుతోంది కదా?ప్రతీరోజు మంత్రులు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌, పవన్‌ కళ్యాణ్‌లను నోటికి వచ్చిన్నట్లు తిడుతూనే ఉన్నారుగా? అద్దాల మేడలో కూర్చొని రాళ్ళేస్తూ మళ్ళీ ఎవరూ తమపై రాళ్ళు వేయొద్దని కోరుకొంటే సాధ్యమా? వైసీపీ నేతలే ఆలోచించుకోవాలి.

ADVERTISEMENT
Latest Stories