ఒకసారి జరిగితే పొరపాటు. కానీ పదేపదే తప్పులు చేస్తుంటే దురలవాటు, అజ్ఞానం, అహంకారం అనుకోవాల్సి ఉంటుంది. ఇది వైసీపీకి బాగా వర్తిస్తుంది.
అధికారంలో రాగానే అమరావతిని కాదని మూడు రాజధానులు అనడమే తప్పు. ఆ తప్పుని కూడా వైసీపీ సరిగ్గా చేయలేక తడబడి విశాఖ రాజధాని అంది. మళ్ళీ ఆ తప్పుని సరిగ్గా చేయలేక రుషికొండ ప్యాలస్ కట్టి చూపించింది.
అధికారమనే కాటరాక్ట్ పొర కంటికి అడ్డంగా ఉన్నప్పుడు ఎన్ని తప్పులు చేసినా కనపడవు. కనుక చెల్లుతుంది. కానీ ప్రజలు ఆపరేషన్ చేసి ఆ పొర తొలగించిన తర్వాత కూడా అదే పొరపాట్లు చేస్తుంటే ఏమనుకోవాలి?
ఆంధ్రప్రదేశ్‌కి అత్యవసరంగా రాజధాని ఏర్పటు చేసుకోవాలనే ఇంగితం లేకపోగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణ పనులు శరవేగంగా చేస్తుంటే వాటినీ వైసీపీ నేత అంబటి రాంబాబు తప్పు పడుతూ, నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
తాము చేయని, చేయలేక చేతులెత్తేసిన పనులను కూటమి ప్రభుత్వం ఇంత వేగంగా చేస్తుంటే, ఓ రాష్ట్ర పౌరుడిగా అంబటి రాంబాబు సంతోషించాలి. కానీ “నా కర్మ కాకపోతే ఏపీకి అంతర్జాతీయ స్థాయి రాజధాని దేనికి?మనం అంత గొప్పా?మనకి ఢిల్లీ కంటే పెద్ద రాజధాని అవసరమా?తినడానికి తిండి లేదు కానీ మీసాలకు సంపెంగ నూనె కావాలంటే ఇదేగా?” అంటూ చాలా అవహేళనగా మాట్లాడారు.
అమరావతి నిర్మాణ పనులు మళ్ళీ మొదలయినందుకు రాష్ట్ర ప్రజలు అందరూ సంతోషిస్తుంటే, వైసీపీ నేతల తీరు ఇలా ఉంది.
రాష్ట్రంలో అనేక ప్రజాసమస్యలున్నాయి. కనీసం వాటినీ గుర్తించకుండా, కూటమి ప్రభుత్వంపై తమ పార్టీ రాజకీయంగా పైచేయి సాధించగలదనుకొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశం ఎత్తుకొని హడావుడి చేశారు. ఇప్పుడు అమరావతి నిర్మాణాన్ని తప్పు పడుతున్నారు!
అమరావతి విషయంలో వైసీపీ వైఖరి ఏమిటో ప్రజలకు తెలిసింది. కనుక దాని నిర్మాణం కొలిక్కివస్తున్నప్పుడు మిగిలిన పనులకు వైసీపీ వలన మళ్ళీ ఆటంకం కలగకూడదని రాష్ట్ర ప్రజలు కోరుకుంటారు. కనుక వచ్చే ఎన్నికలలో కూడా వైసీపీని పక్కన పెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. బహుశః ఇది గ్రహించి ఆ భయంతోనే అమరావతిపై బురద జల్లుతున్నారేమో?
కానీ ఈ బురద కూడా వారి కర్మ ఫలాన్ని నిర్దేశిస్తుందని గ్రహించడం లేదు. ఇదివరకు అమరావతిని దెబ్బ తీసినందుకు ప్రజలు ఓడించారు. అయినా అమరావతిపై వైసీపీ రాజకీయాలు చేయడం, ఇలా బురద జల్లడం మానుకోవడం లేదు. కనుక అంబటి చెప్పుకున్నట్లు అమరావతి ఖచ్చితంగా వారి కర్మ ఫలాన్ని నిర్దేశించబోతోంది. అందుకువైసీపీ ‘సిద్ధం’గా ఉంటే మంచిది.
కర్మ కాకపోతే ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచ స్థాయి రాజధాని ఎందుకు రా స్వామి?
అంత గొప్పా మనం?#Amaravati pic.twitter.com/9R4fb0So9e
— M9 NEWS (@M9News_) November 29, 2025







