బెల్లం చుట్టూ ఈగలు వాలడం ఎంత సహజ సిద్దమైన ప్రక్రియలో భాగమో, ఒక వివాదం చుట్టూ వైసీపీ వాలడం కూడా అంతే సహజమైన కార్యక్రమం. తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చించబడుతున్న వివాదం సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన.
ఇప్పుడు ఈ వివాదం చుట్టే తన రాజకీయం అల్లుతుంది వైసీపీ. ముందుగా జనసేన పార్టీని ఇరుకున పెట్టడానికి, ఆ పార్టీ అధినేత పవన్ ను నేరుగా టార్గెట్ చేయడానికి అల్లు అర్జున్ తరుపున తన వాదనలు వినిపిస్తున్న వైసీపీ బాబు, పవన్ డైరెక్షన్లోనే బన్నీ అరెస్టు అంటూ అసత్య వార్తలు మొదలు పెట్టింది.
అయితే వీటిని ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవడంతో అల్లు అర్జున్ తప్పేముంది.? ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ ఈ సాహసానికి సిద్ధపడ్డారు అంటూ బన్నీ అరెస్ట్ విషయం మీద మాజీ మంత్రి అంబటి రాంబాబు ఒక రివ్యూ ఇచ్చారు.
అయితే నేడు సీఎం రేవంత్ తో భేటీ అయిన సినీ పెద్దలు తమ సమస్యలను ప్రభుత్వానికి వినిపించి జరిగిన అనుకోని ఘటనకు సమాధానం చెప్పి ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం మొదలుపెట్టారు. అయితే ఆదిశగా అడుగులు ముందుకు వెళ్లాయా లేదా అనేది ఒక ప్రశ్నగానే మిగిలింది.
ఈ నేపథ్యంలో అటు ప్రభుత్వానికి ఇటు చిత్ర పరిశ్రమకు మధ్య మరో అగాధం సృష్టించేలా ఒక వివాదాస్పద పోస్ట్ పెట్టారు అంబటి. సమస్య ‘పూర్తి పరిష్కారానికి ఒక సోఫా చేరాల్సిందే’ అంటూ అంబటి తన సోషల్ మీడియా పెట్టిన ఈ పోస్ట్ వైరల్ గా మారింది. పుష్ప సినిమా లో కూడా సమస్యల పరిష్కారానికి గాను పుష్ప సోఫా నిండా డబ్బులు నింపి పంపుతూ ఉండేవారు.
ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డితో వచ్చిన ఈ సమస్య పరిష్కరానికి గాను అల్లు అర్జున్ ఒక సోఫా పంపాల్సిందే అనేలా అంబటి పోస్ట్ పెట్టినట్టు కనిపిస్తుంది. అయితే నేడు తెలుగు చిత్ర పరిశ్రమ కు తెలంగాణ ప్రభుత్వంకు మధ్య జరిగిన సంధి చర్చలకు గాను సోఫా ఉండాల్సిందే అంటున్న రాంబాబు గారు నాడు వైసీపీ ప్రభుత్వానికి టాలీవుడ్ కు మధ్య జరిగిన పంచాయితీ లో వైసీపీ ప్రభుత్వానికి ఎన్ని సోఫాలు దక్కాయి.?
అలాగే అప్పటి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడానికి సినీ పెద్దలను అవమానించి పంపించినట్టో చెప్పగలరా.? ఇలా ప్రతి విషయాన్ని వైసీపీ నేతలు రాజకీయం చేయడం ఆ తరువాత అది తిరిగి తిరిగి మళ్ళీ వైసీపీ మెడకు చుట్టుకోవడంతో సైలెంట్ అవ్వడం వైసీపీకి అలవాటుగా మారిపోయినట్టు ఉంది.




