
కూటమిలో నేతలే వైసీపీకి నిప్పు అందిస్తున్నారా?
ఇటీవల నారా లోకేష్‌ని ఉప ముఖ్యమంత్రిగా ప్రమోట్ చేయాలనే పార్టీ నేతల డిమాండ్స్, వాటికి జనసేనలో కొందరు అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఘాటుగా బదులివ్వడం, ఈ అంశాన్ని పట్టుకొని అల్లుకుపోదామని వైసీపీ పడిన తాపత్రయం అందరూ చూశారు.
Also Read – ఆప్ ఓటమికి బిఆర్ఎస్ స్కాములే కారణమా..?
కానీ సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా తమ పార్టీ నేతలకు గట్టిగా హెచ్చరించడంతో అందరూ వెనక్కు తగ్గారు. ఇది వైసీపీకి చాలా నిరాశ కలిగించి ఉండవచ్చు. కానీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ చేసిన తాజా వ్యాఖ్యలు మళ్ళీ వైసీపీలో కొత్త ఆశలు చిగురింపజేశాయి.
“కూటమి ప్రభుత్వంలో బీజేపికి తగిన ప్రాధాన్యత లభించడంలేదని, బీజేపి నేతలని ఎవరూ పెద్దగా పట్టించుకోవడం లేదు. ఎప్పుడూ టీడీపీ, జనసేన జెండాలు, ఆ పార్టీల మంత్రులు, నేతలే అన్ని కార్యక్రమాలలో కనబడుతుంటారు తప్ప బీజేపివాళ్ళు ఎవరూ కనబడరు.బీజేపి కూడా కలిస్తేనే కూటమి ఘన విజయం సాధించినప్పుడు, కూటమి ప్రభుత్వంలో సముచిత గౌరవం లభించకపోవడం బాధ కలిగిస్తోంది,” అని అన్నారు.
Also Read – ఏపీలో క్రూజ్ పర్యాటకం త్వరలో..
కూటమిలో భాగస్వామిగా ఉన్నప్పుడు సముచిత గౌరవం, ప్రాధాన్యం ఆశించడం సహజమే. లభించనప్పుడు ఈ విషయం సిఎం చంద్రబాబు నాయుడితోనే నేరుగా మాట్లాడుకొని పరిష్కరించుకోవాలి. బహుశః ఆయన ఏదో పదవి ఆశించి లభించకపోవడంతో తన అసహనాన్ని ఈరూపంలో బయటపెట్టి ఉండవచ్చు.
కానీ ఈవిదంగా బహిరంగంగా వ్యాఖ్యలు చేయడం కూటమిలో విభేధాలు నెలకొన్నాయని ప్రజలకు, వైసీపీకి చాటి చెపుతున్నట్లే అవుతుంది. పవన్ కళ్యాణ్-నారా లోకేష్ పేరుతో కూటమిలో చిచ్చు రగిలించేందుకు విఫలయత్నాలు చేస్తున్న వైసీపీకి, ఇప్పుడు అంబిక కృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు మరో అవకాశం కల్పించిన్నట్లయింది.
Also Read – జీఎస్టీ ఆదాయం తగ్గితే.. సిగ్గు పడాల్సింది బాబు కాదు.. జగనే!
ఇటీవల అమిత్ షా ఏపీకి వచ్చినప్పుడు ఏపీలో బీజేపిని బలోపేతం చేసుకునేందుకు చురుకుగా పార్టీ కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర బీజేపి నేతలకు చెప్పారు తప్ప కూటమిలో చిచ్చు పెట్టమని చెప్పరు కదా?
కానీ ఆయన బీజేపి నేతలతో సమావేశమైన తర్వాతే అంబికా కృష్ణ ఈవిదంగా వ్యాఖ్యలు చేశారంటూ, ఆయన అసహనానికి వైసీపీ, దాని సొంత మీడియా వక్ర భాష్యాలు చెపుతూ కూటమిలో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది.
కనుక ఎన్నికల సమయంలో కూటమిలో మూడు పార్టీలు ఏవిదంగా సమన్వయ కమిటీలు ఏర్పాటు చేసుకొని సమిష్టి కార్యాచరణతో ముందుకు సాగేవో, ఇప్పుడూ అదేవిదంగా ముందుకు సమన్వయంతో ముందుకు సాగుతూ వైసీపీ కుట్రలకు కూటమి, ప్రభుత్వం నష్టపోకుండా కాపాడుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది.