విలక్షణ సినిమాలను తెరకెక్కించిన ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన తాజా చిత్రం “అమీ తుమీ.” తను పరిచయం చేసిన అవసరాల శ్రీనివాస్ తో పాటు అడవి శేష్, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రలలో (అంతకుముందు ఆ తర్వాత ఫేం) ఈషా హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. వినోదం పాళ్ళు పూర్తి స్థాయిలో రంగరించి వదిలిన సినిమాగా ట్రైలర్ స్పష్టం చేస్తోంది.
కన్ఫ్యూజన్ కామెడీని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఎన్నో సార్లు చూసి ఉన్నారు. సరిగ్గా అదే పాయింట్ మళ్ళీ ఇంద్రగంటి కొత్తగా ప్రజెంట్ చేసే ప్రయత్నం చేసినట్లుగా కనపడుతోంది. అయితే ఈ సారి హీరోహీరోయిన్లతో పాటు తనికెళ్ళ భరణి మరియు ఇతర సహా నటీనటుల చేత కూడా ఎంటర్టైన్మెంట్ ను పండించాలని చేసిన ప్రయత్నం ట్రైలర్ లో కనపడుతోంది. ట్రైలర్ లో బిట్లు బిట్లుగా కట్ చేస్తారు కాబట్టి పెద్దగా ఇబ్బంది అనిపించదు గానీ, దీనిని సిల్వర్ స్క్రీన్ పై ఎలా ప్రజెంట్ చేయబోతున్నారనేది కీలకం.
కామెడీ పండితే అది ఎప్పుడూ కనకవర్షమే కురిపిస్తుంది. ఒకవేళ అలా కాని పక్షంలో కాసుల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూడాల్సి వస్తుంది. మరి ఈ రెండింటిలో ఇంద్రగంటి ఏ మార్గాన్ని ఎంచుకున్నారు అనేది త్వరలో తేలనుంది. అయితే ఇంద్రగంటి దగ్గర ఉన స్పెషాలిటీ ఏమిటంటే… డబుల్ మీనింగ్ డైలాగ్స్ తో కూడిన అడల్ట్ కామెడీ కాకుండా, ఫ్యామిలీ అంతా చక్కగా కూర్చుని నవ్వుకునే ఆహ్లాదకరమైన కామెడీని పండించడంలో దిట్ట. మరి ‘అమీ తుమీ’ ఆ దిశగా ఉందో లేదో చూడాలి.



