కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు ఈనాడు గ్రూప్ అధినేత రామోజీరావుతో రామోజీ ఫిలిం సిటీలో భేటీ అయ్యారు. హైదరాబాద్ నోవాటేల్ హోటల్‌లో జూ.ఎన్టీఆర్‌తో భేటీ అయ్యారు. టిడిపితో పరోక్షంగా సంబందాలున్న వారిరువురితో అమిత్ షా భేటీ అవడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెనుమార్పులు సంభవించే అవకాశం కనిపిస్తోంది.
మూడేళ్ళ వైసీపీ పాలనలో దయనీయ పరిస్థితికి దిగజారిపోయిన ఏపీని మళ్ళీ గాడిన పెట్టేందుకు టిడిపి, బిజెపి, జనసేనలు మూడూ మళ్ళీ కలిసి పనిచేయాలని రామోజీరావు బిజెపి పెద్దలకు సూచించడంతోనే ఈ భేటీ జరిగినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీయే అభ్యర్ధి ద్రౌపదీ ముర్ముకి టిడిపి మద్దతు పలకడం, ఆమె విజయవాడ వచ్చినప్పుడు టిడిపి, బిజెపి నేతలు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని సరదాగా మాట్లాడుకోవడం, తర్వాత ఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్రమోడీ చంద్రబాబు నాయుడుని ఆప్యాయంగా పలకరించడం, ఇప్పుడు రామోజీరావుతో అమిత్ షా భేటీ వంటి ఈ పరిణామాలన్నిటినీ కలిపి చూస్తే టిడిపి, బిజెపిలు మళ్ళీ దగ్గరవుతున్నట్లు అర్దమవుతోంది. కనుక రామోజీరావు-అమిత్ షాల భేటీ ఏపీ రాజకీయాల కోసమేనని భావించవచ్చు.
ఇక ఎప్పుడూ రాజకీయాల గురించి మాత్రమే ఆలోచించే అమిత్ షా ఆర్ఆర్ఆర్ సినిమాలో జూ.ఎన్టీఆర్ నటనను చూసి ముగ్దుడయ్యారంటే చాలా సంతోషమే. అయితే జూ.ఎన్టీఆర్‌ను అభినందించడానికి అదొక్కటే కారణమనుకోలేము.
ఈసారి ఎలాగైనా తెలంగాణలో అధికారంలోకి రావాలని బిజెపి చాలా పట్టుదలగా కృషి చేస్తోంది. తెలంగాణ సిఎం కేసీఆర్ నిజాం నవాబుల పట్ల తన అభిమానాన్ని, అలాగే మజ్లీస్ పార్టీతో దోస్తీని ఏనాడూ దాచుకొనే ప్రయత్నం చేయలేదు. కనుక బిజెపి నేతలు ఆయనను రజాకార్ల దోస్త్ గా అభివర్ణిస్తుంటారు.
ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్ తెలంగాణ వీరుడు కొమురం భీమ్‌గా నటించిన సంగతి తెలిసిందే. కనుక కొమురం భీమ్‌గా నటించిన జూ.ఎన్టీఆర్‌ను అభినందించడం ద్వారా, తెలంగాణ యోధులు, వారి పోరాటాలంటే బిజెపికి చాలా గౌరవమని ప్రజలకు చాటి చెప్పాలని భావించి ఉండవచ్చు.
ఇక మరో బలమైన కారణం కూడా కనిపిస్తోంది. కొమురం భీమ్‌గా నటించి తెలంగాణ ప్రజల మనసులు దోచుకొన్న జూ.ఎన్టీఆర్‌ను వీలైతే బిజెపిలో చేర్చుకోవడం లేదా తెలంగాణలో బిజెపి తరపున ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని అమిత్ షా కోరి ఉండవచ్చు.
ఈ ఇద్దరితో అమిత్ షా భేటీలకు పెద్ద ప్రాధాన్యత లేదని బిజెపి వర్గాలు చెపుతున్నప్పటికీ, వీటి ఫలితాలు రాబోయే రోజుల్లో తప్పక కనబడతాయి.



