ఈసారి లోక్‌సభ ఎన్నికలలో ఎన్డీయే కూటమికి ఆశించిన స్థాయిలో ఎంపీ సీట్లు రాకపోవడంతో బీజేపీ అధిష్టానం చాలా ఆందోళన చెందింది. అయితే ఈ ప్రమాదాన్ని ముందుగానే పసిగట్టిందో ఏమో దూరదృష్టి ప్రదర్శించి బిహార్‌లో నితీష్ కుమార్‌తో, ఏపీలో చంద్రబాబు నాయుడుతో మళ్ళీ స్నేహం కలుపుకుంది. ఆ దూరదృష్టే బీజేపీని కాపాడి మళ్ళీ అధికారం దక్కేలా చేసిందని చెప్పవచ్చు.
జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేస్తే కనీసం స్పందించని ప్రధాని నరేంద్రమోడీ, తమ ప్రభుత్వం మనుగడకు టిడిపి మద్దతు చాలా కీలకంగా మారడంతో ఎన్డీయే సమావేశంలో ఆయనపై కాస్త అదనంగా ప్రేమ ఒలకబోయడం అందరూ చూశారు. అలాగే ఇదివరకు కత్తులు దూసిన చేతులతోనే మోడీ ఇప్పుడు నితీష్ కుమార్‌కు షేక్ హ్యాండ్ ఇస్తున్నారు.
మహారాష్ట్రలో ఇదివరకు శివసేన, బీజేపీలు మిత్రపక్షాలుగా, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలలో భాగస్వాములుగా ఉండేవి. అలాంటి శివసేనను కూడా ఏక్‌నాధ్ షిండే అనే కటప్పతో నిలువునా చీల్చడానికి బీజేపీ వెనకాడలేదు. అలా చీల్చిన ‘కట్టప్ప (శివ)సేన’ కూడా ఇప్పుడు మోడీ ప్రభుత్వం మనుగడకు ఊతం ఇస్తోంది.
తమ ప్రభుత్వం సొంతంగా మెజార్టీ సాధించలేక మిత్ర పక్షాల మద్దతుతో మనుగడ సాగించవలసి వస్తునందుకు మోడీ, అమిత్ షాలు మొదట్లో బాధపడే ఉంటారు. కానీ అప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుని మళ్ళీ తమ విశ్వరూపం చూపడం మొదలుపెట్టారు.
ఆనవాయితీ ప్రకారం లోక్‌సభలో అత్యధిక సీట్లు కలిగిన బీజేపీ లోక్‌సభ స్పీకర్ పదవి దక్కుతుంది కనుక ప్రతిపక్షాలు అందుకు అంగీకరిస్తున్నాయి. అయితే అదే ఆనవాయితీ ప్రకారం లోక్‌సభ డెప్యూటీ స్పీకర్ పదవిని తమకు కేటాయించకపోవడాన్ని తప్పు పడుతున్నాయి.
లోక్‌సభలో ఎన్డీయేకు 293 మంది సభ్యులు ఉండగా, ఇండియా కూటమికి 233 మంది ఉన్నారు. కనుక తమకు డెప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వడానికి మోడీ, అమిత్ షాలకు అభ్యంతరం దేనికి?అనే ప్రశ్నకు వారు సమాధానాలు చెప్పడం లేదు.
కానీ మోడీ, అమిత్ షాలు పంతానికి పోవడంతో ఇండియా కూటమి కూడా స్పీకర్ పదవికి కేరళకు చెందిన కె సురేష్ చేత నామినేషన్స్ వేయించింది. దీంతో ఈ ఏడున్నర దశాబ్ధాలలో నాలుగోసారి స్పీకర్ పదవికి ఈరోజు పోటీ జరుగబోతోంది.
లోక్‌సభలో ఎన్డీయేకు పూర్తి మెజార్టీ ఉంది కనుక తమ స్పీకర్ అభ్యర్ధి ఓం బిర్లాను అవలీలగా గెలిపించుకోగలదు. అయితే ఈ ఎన్నికలో ఇండియా కూటమి ఓడిపోయినా దానికి కొత్తగా వచ్చే నష్టం ఏమీ ఉండబోదు.
కానీ ఒకవేళ ఎన్డీయే కూటమిలో భాగస్వాములే మోడీ తీరుని వ్యతిరేకిస్తూ క్రాస్ ఓటింగ్ చేస్తే?ఇండియా కూటమి అభ్యర్ధి కె సురేష్ స్పీకర్‌గా ఎన్నికైతే నష్టపోయేది ఎవరు?అని ఆలోచిస్తే ఈ సమస్య తీవ్రత అర్దమవుతుంది.
ఏకగ్రీవంగా చాలా సానుకూల వాతావరణంలో జరగాల్సిన స్పీకర్ ఎన్నికలో ఇటువంటి అవాంఛనీయ పరిణామాలు జరగడానికి కారణం ప్రధాని నరేంద్రమోడీ పంతమే కారణమని చెప్పక తప్పదు.
ఇటువంటి ధోరణి కారణంగానే ఈసారి లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి కనీసం 300 సీట్లు కూడా రాలేదని, ఇండియా కూటమికి 233 సీట్లు వచ్చాయని గ్రహించకపోతే చివరికి నష్టపోయేది ఎన్డీయే కూటమే.




