బిజెపి ఏ రాష్ట్రంపైనైనా దృష్టి పెడితే ఏవిదంగా పావులు కదుపుతుందో గోవా, మహారాష్ట్ర, కర్ణాటక తదితర రాష్ట్రాలలో అందరూ చూశారు. ఇప్పుడు బిజెపి తెలంగాణపై దృష్టి పెట్టడంతో కేసీఆర్ ప్రభుత్వం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే బిజెపి (కేంద్ర ప్రభుత్వం) ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నట్లు అక్కడ ఢిల్లీలోని కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టాలని ప్రయత్నిస్తుండటం విశేషం.
కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని దెబ్బ తీయడానికి కేంద్ర ప్రభుత్వం చాలా కాలంగా ప్రయత్నిస్తోంది కానీ సాధ్యపడటం లేదు. ఇప్పుడు కేజ్రీవాల్ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, తెలంగాణ సిఎం కేసీఆర్ కల్వకుంట్ల కవిత, తెలంగాణ మద్యం వ్యాపారులతో కలిసి భారీ స్కామ్ చేశారని బిజెపి ఎంపీ పర్వేష్ వర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాలు ఆరోపించడంతో ఈ కధ మొదలైంది.
ఆ ఆరోపణలను కవిత వెంటనే ఖండించినప్పటికీ, ఆమె రాజీనామా చేయాలంటూ బిజెపి కార్యకర్తలు నిన్న ఆమెను ఇంటిని ముట్టడించడం, ప్రతిగా టిఆర్ఎస్ కార్యకర్తలు బిజెపి పోస్టర్లను చించివేయడం, అప్పుడు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడంతో పోలీసులు ఎక్కడికక్కడ బిజెపి నేతలు, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారు. జనగామలో బండి సంజయ్‌ని, హైదరాబాద్‌లో బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వ్యవహారంలో బిజెపి నేరుగా కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితను టార్గెట్ చేయడంతో టిఆర్ఎస్ నేతలు బిజెపిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఈ ప్రయత్నంలో టిఆర్ఎస్ శ్రేణులు, బిజెపి శ్రేణులతో ముఖాముఖి ఘర్షణలకు దిగుతుండటంతో బిజెపి ఉచ్చులో టిఆర్ఎస్ చిక్కుకొన్నట్లే ఉంది.
మరోపక్క ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి అస్థిరపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఆమాద్మీ పార్టీలో కొంతమంది ఎమ్మెల్యేలతో పార్టీని చీల్చి బిజెపిలో చేరితే తనపై కేసులన్నీ ఎత్తివేస్తామని ఓ బిజెపి నేత ఫోన్ ద్వారా ఆఫర్ ఇచ్చారని, మనీష్ సిసోడియా ఆరోపించారు.
ఈవిదంగా లిక్కర్ కుంభకోణంతో అక్కడ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని, ఇక్కడ కేసీఆర్ ప్రభుత్వాన్ని ఒకేసారి దెబ్బ తీయాలని కేంద్రం ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. మరి బిజెపికి, టిఆర్ఎస్, ఆమాద్మీ పార్టీలకు మద్య మొదలైన ఈ పవర్ ప్లేలో ఎవరెవరు అవుట్ అవుతారో చూడాలి.



