వైఎస్సార్సీపీ అధినేత జగన్ కర్నూలులో చేపట్టిన మూడు రోజుల దీక్షపై టీడీపీ నేత ఆనం వివేకానందరెడ్డి మండిపడ్డారు. జగన్ దొంగ నాటకాలు కట్టిపెట్టాలని సూచించిన ఆనం, “జగన్! ఆప్ కీ ఖేల్ ఖతమ్… వెరీ సూన్… అబ్బయ్యా..!” అంటూ తనదైన శైలిలో వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. జగన్ దీక్షను చూస్తుంటే తనకు చిరంజీవి సినిమాలోని ‘జపం జపం జపం కొంగ జపం… తపం తపం తపం దొంగ తపం’ పాట గుర్తుకొస్తోందని చేసిన వ్యాఖ్యలకు మీడియా జనాలు సైతం నవ్వుకున్నారు.
జగన్ టైం అయిపోయిందని, ఊరికే దీక్షలు చేస్తున్నారని, బలిసి దీక్షలు చేస్తున్నారని ఘాటు వ్యాఖ్యలు చేసారు. రైతు సమస్యలపై అవగాహన లేని వైకాపా అధ్యక్షుడు జగన్ చేస్తున్నది జల దీక్ష కాదు… జలగ దీక్ష అని ఆనం వివేకానందరెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా జగన్ దోచుకున్నారని, తన పరిశ్రమలకు ప్రాజెక్టుల నుంచి నీటిని తరలించుకుపోతున్న జగన్ ఇప్పుడు దీక్షల పేరుతో ప్రజల్ని మభ్యపెట్టేందుకు చూస్తున్నారని ఆరోపించారు.
ఆంధ్ర ప్రజలు కన్నీరు పెడుతున్నారని చెబుతున్న జగన్.. తన ఎమ్మెల్యేలు ఒక్కక్కొరూ పార్టీ వీడిపోతుంటే తానే కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. ఆరు నెలల్లో వైకాపా ఖాళీ అవుతుందని, జగన్‌కు ప్రతిపక్ష హోదా సైతం పోతుందని జోస్యం చెప్పారు.



