సాధారణంగా జిల్లా ఎస్పీ స్థాయి పోలీస్ అధికారులు మీడియా ఫోకస్‌లోకి రారు. కానీ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగిపోతోంది. అందుకు కారణం అధికార వైసీపీపట్ల ఆయన చూపుతున్న విధేయతే.
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో వ్యవహారంలో క్లీన్ చిట్ ఇవ్వడంతో ఆయన పేరు అన్ని జిల్లాల ప్రజలకు తెలిసింది. అయితే అంతకు ముందు మరో కేసులో కూడా ఆయన అత్యుత్సాహం ప్రదర్శించడంతో ఎస్పీ ఫకీరప్పపై కేసు నమోదైంది. అనంతపురంలోనే ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేసిన ప్రకాష్ ఆయనపై ఫిర్యాదు చేయడం విశేషం.
ఇంతకీ ఓ కానిస్టేబుల్ తనపై అధికారి అయిన ఎస్పీ ఫకీరప్పపై ఎందుకు ఫిర్యాదు చేశారంటే, దీని వెనక ఓ పెద్ద కధ ఉంది.
ఈ ఏడాది జూన్ 14న శ్రీసత్యసాయి జిల్లా చెన్నేకొత్తపల్లిలో జరిగిన సిఎం జగన్ సభలో బందోబస్తు డ్యూటీలో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ తమ సెలవుల బకాయిలు చెల్లించాలని కోరుతూ ప్లకార్డు ప్రదర్శించారు. సిఎం సభలో ఓ కానిస్టేబుల్ నిరసన తెలపడంతో ఎస్పీ ఫకీరప్ప ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించారు కానీ వేరే కారణంతో.
ప్రకాష్ ఓ స్థానిక మహిళ బి.లక్ష్మి వద్ద బలవంతంగా రూ.10 లక్షలు నగదు, 30 తులాల బంగారం తీసుకొన్నాడని, ఆమెపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ప్రకాష్ తన వద్ద నుంచి డబ్బు, బంగారం ఏదీ తీసుకోలేదని, తనపై అత్యాచారం చేయలేదని సదరు మహిళ బి.లక్ష్మి స్వయంగా పోలీస్ స్టేషన్‌కు వచ్చి చెపుతున్నా ఎవరూ పట్టించుకోలేదు!
కనుక ఎస్పీ ఫకీరప్ప ఉద్దేశ్యపూర్వకంగా తనను అక్రమకేసులో ఇరికించారని కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు చేశారు. ఫకీరప్పపై టూటౌన్ పోలీసులు సెక్షన్స్ 167,177,182, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. డీఐజీ అధ్వర్యంలో ఈ విచారణ జరుగుతుందని సీఐ శివరాముడు తెలిపారు.
ఇదంతా చూస్తే ఎస్పీ ఫకీరప్ప వైసీపీకి వీరవిదేయత ప్రదర్శించడం వలననే సమస్యలలో కూరుకుపోయారని అర్దమవుతోంది. కనుక ఇప్పుడు ఆయనను గోరంట్ల మాధవ్ కాపాడాలేమో?



