జగన్ హయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి, అరాచకాలు, రాజకీయ కక్షలు, వైసీపీ రంగులు, సంక్షేమ పధకాలతో అనూహ్యమైన, అవాంచనీయమైన ఓ రాజకీయ ట్రెండ్ నడుస్తుండేది.
ఏపీలో నెలకొన్న ఈ పరిస్థితులతో తెలంగాణకు చాలా లబ్ది కలిగింది. తెలంగాణకు పరిశ్రమలు, లక్షల కోట్ల పెట్టుబడులు వస్తుండేవి.
కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతీ రంగాన్ని అభివృద్ధి చేసుకుంది. ఏపీలో విధ్వంస పాలన సాగుతుంటే, తెలంగాణలో అభివృద్ధి జరుగుతుండటంతో తేడా చాలా స్పష్టంగా కనపడేది.
కానీ ఏపీ, తెలంగాణలలో ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితి తారుమారు అయ్యింది. సిఎం రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ అభివృద్ధికి గట్టిగా కృషి చేస్తున్నప్పటికీ, అయన చేతులు కాళ్ళు కట్టేసినట్లు పరిస్థితులున్నాయి.
రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం కనుక కేంద్రంతో పేచీలు తప్పనిసరి. కనుక సహకారం లభించడం కష్టం.
రేవంత్ రెడ్డికి పక్కలో బల్లెంలా బీఆర్ఎస్ పార్టీ ఉండనే ఉంది. మంత్రి పదవి దక్కని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే సిఎం రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ పార్టీ మీద నిప్పులు చెరుగుతూనే ఉన్నారు. మంత్రి పదవులు లభించిన కొండా సురేఖ వంటివారు తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ప్రభుత్వానికి తలనొప్పిగా మారారు.
రాష్ట్ర స్థాయిలో పరిస్థితులు ఈవిదంగా ఉంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఒత్తిళ్ళు ఉండనే ఉంటాయి. కనుక నెలకు ఒకటి రెండు సార్లు ఢిల్లీ వెళ్ళి రాక తప్పడం లేదు. ఢిల్లీ వెళ్ళినా రాష్ట్రానికి, పార్టీకి, ప్రభుత్వానికి ఎటువంటి ఉపశమనం లభించడం లేదు కానీ ఆ కారణంగా విమర్శలు భరించక తప్పడం లేదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదృష్టం కొద్దీ కల్వకుంట్ల కుటుంబంలో చిచ్చు రగిలింది. కనుక వారు ఆ మంటలు ఆర్పుకునే పనిలో బిజీగా ఉన్నారు. తెలంగాణ బీజేపి పెద్దగా హడావుడి చేయకపోవడం కూడా రేవంత్ రెడ్డి అదృష్టమనే చెప్పాలి. కనుక తెలంగాణలో ప్రస్తుతం ఏం జరుగుతోందని ప్రశ్నించుకుంటే రాజకీయాలు మాత్రమే అని చెప్పుకోవలసి వస్తోంది.
ఇక సిఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
సిఎం చంద్రబాబు నాయుడుకి కూడా జగన్ పక్కలో బల్లెంలా ఉన్నారు. ‘రప్పా రప్పా…’ అంటూ అప్పుడప్పుడు రెచ్చిపోతూనే ఉన్నారు. అమరావతి మునిగిపోయిందని, పోలవరం కొట్టుకుపోయిందనీ, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, అప్పులు పెరిగిపోయాయని వైసీపీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తూనే ఉంది.
కానీ సిఎం చంద్రబాబు నాయుడు వైసీపీని దీటుగా ఎదుర్కొంటూనే రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపిస్తున్నారు. ఒకప్పుడు సంక్షేమ పధకాల గోల తప్ప ఏపీలో మరో మాట వినిపించేది కాదు. కానీ ఇప్పుడు ప్రతీరోజూ వార్తలలో అభివృద్ధికి సంబందించిన వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
అంటే ఏపీలో మార్పు మొదలయ్యిందన్న మాట! దీని కోసమేగా ఆంధ్రా ప్రజలు 5 ఏళ్ళుగా కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు!




