జగన్ సర్కార్‌కి రిటర్న్ గిఫ్ట్.. ఉద్యోగులు మాత్రమేనా?

Parchuri-Ashok-Babuసినిమాలలో హీరోలు పంచ్ డైలాగులు చెప్పినప్పుడు ప్రేక్షకులు చప్పట్లు కొట్టడం తెలుసు. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రులు కూడా పంచ్ డైలాగులు కొట్టి ‘సమీకరించిన జనాలతో’ చప్పట్లు కొట్టించుకొని ‘థాంక్యూ సిఎం సార్’ అని వ్రాసున్న ప్లకార్డులు చూసుకొని తృప్తిపడుతున్నారు.

“మాట తప్పను… మడమ తిప్పను…” డైలాగ్ కూడా అటువంటిదే. అది ఎవరిదో అందరికీ తెలుసు. కానీ ఎన్నిసార్లు మాట తప్పారో… మడమ తిప్పారో ఎవరూ లెక్క చెప్పలేరు.

ADVERTISEMENT

సీపీఎస్ విషయంలో కూడా జగన్ సర్కార్ మాట తప్పినందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సెప్టెంబర్‌ 1వ తేదీన ‘మిలియన్ మార్చ్’ కి సిద్దమయ్యారు. కానీ జగన్ సర్కార్ సెలవులో ఉన్న ఉద్యోగులందరికీ పోలీసులతో ఫోన్లు చేయించి, నోటీసులు ఇప్పించి, గృహనిర్బందాలు విధించి కదలకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొంది.

ఈసారి ప్రభుత్వం, పోలీసుల ఒత్తిడి చాలా ఎక్కువైపోవడంతో ‘మిలియన్ మార్చ్’ ని వాయిదా వేసుకొంటున్నట్లు ఉద్యోగ-ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు. కానీ నేటికీ కొన్ని సంఘాలు ‘ఛలో విజయవాడ’ అంటూనే ఉన్నాయి. అది వారి ఆగ్రహాన్ని సూచిస్తోందని చెప్పవచ్చు.

ఉద్యోగ సంఘాల మాజీ నాయకుడు, టిడిపి ఎమ్మెల్సీ అశోక్ బాబు విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ, “జగన్ సర్కార్ ఉద్యోగులు, ఉపాధ్యాయులతో చలగాటం ఆడుతోంది. పోలీసులతో వారిని భయపెట్టి అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది. వారిపై ఒత్తిడి చేసి తాత్కాలికంగా వారి ఉద్యమాలని అడ్డుకోగలదేమో కానీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ కలిసికట్టుగా ముందుకువస్తే వారి ముందు ఎవరూ ఎదురునిలవలేరు.

వారేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు. కానీ వారి న్యాయబద్దమైన కోరికలను కూడా జగన్ సర్కార్ తీర్చలేక మాయమాటలు చెపుతోంది. వారితో ఈవిదంగా వ్యవహరిస్తున్నందుకు వచ్చే ఎన్నికలలో రాష్ట్రంలో 13.35 లక్షల మంది ఉద్యోగులు జగన్ సర్కార్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం,” అని అన్నారు.

అయితే జగన్ సర్కార్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు రాష్ట్రంలో ఇంకా చాలామంది ఎదురుచూస్తున్నారు.

సంక్షేమ పధకాల కోసం అప్పులు చేస్తూ ఆ భారాన్ని మిగిలిన ప్రజలపై వేస్తున్నందుకు వారు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకొంటున్నారు.

విద్యుత్‌ ఛార్జీలు పెంచి, మళ్ళీ ట్రూ అప్‌ పేరుతో అదనంగా వసూలు చేస్తున్నందుకు, చెత్తపన్ను వసూలు చేస్తున్నందుకు మద్యతరగతి ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకొంటున్నారు.

పాఠశాలలు విలీనం చేసి తమని పిల్లలని ఇబ్బంది పెడుతున్నందుకు విద్యార్థుల తల్లితండ్రులు, విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించేస్తున్నందుకు విద్యావేత్తలు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనుకొంటున్నారు.

సినీ పరిశ్రమతో చలగాటం ఆడుతున్నందుకు హీరోల అభిమానులు, మోటర్లకు మీటర్లు పెడుతున్నందుకు రైతులు, కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి డబుల్ చేసినందుకు ఆక్వా రైతులు, రాజధాని రైతులు, పోలవరం నిర్వాసితులు ఇంకా చాలా మందే ఉన్నారు జగన్ సర్కార్‌కు రిటర్న్ గిఫ్ట్ఇచ్చేందుకు. ఇవన్నీ ఒక ఎత్తైతే మోడీ, అమిత్‌ షాలు ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ ఒక్కటీ ఒక ఎత్తు అని చెప్పవచ్చు. అది ఏవిదంగా ఉండబోతోందో ఎవరూ ఊహించలేరు కూడా.

ADVERTISEMENT
Latest Stories