ఆనాడు రాజుల సొమ్ము రాళ్ళపాలైన్నట్లు ఇప్పుడు దేవుడి సొమ్ము పాలకుల పాలనుకోవలసి వస్తోంది. సామాన్య భక్తులు ఎంతో వ్యయ ప్రయాసలకోర్చి పుణ్యక్షేత్రాలకు వచ్చి దైవదర్శనం చేసుకొని యధాశక్తిన కానుకలు సమర్పించుకొంటుంటారు. ఆ విదంగా వారు సమర్పించే కానుకలతో పుణ్యక్షేత్రాలలో వారికి సౌకర్యాలు కల్పించాలి. రాష్ట్రంలో శిధిలావస్థకు చేరుకొన్న ఆలయాలను పునరుద్దరించాలి. ఇంకా హిందూధర్మ ప్రచారానికి, ధర్మ కార్యాలకు ఉపయోగించాలి.
తిరుమలతో సహా రాష్ట్రంలో అన్ని పుణ్యక్షేత్రాలకు హుండీ కానుకల ద్వారా కోట్లాది రూపాయలు, వెండిబంగారు నగలు అందుతున్నప్పటికీ, ఎప్పటికప్పుడు దర్శనం, ప్రత్యేక పూజలు, ప్రసాదం ధరలు పెంచుకొంటూపోతూనే ఉన్నాయి. ఏమంటే…అన్నిటి ధరలు పెరిగిపోతున్నాయి..నష్టం వస్తోంది కనుక ధరలు పెంచక తప్పడం లేదని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. అసలు లాభనష్టాల గురించి మాట్లాడితే అది వ్యాపారం అవుతుంది కానీ భక్తి, ఆధ్యాత్మికత ఎలా అవుతుంది? అంటే భక్తుల భక్తి, ఆద్యాత్మికతలను వ్యాపారంగా మార్చేశారని అర్ధం అవుతుంది.
భక్తులకు సౌకర్యాలు కల్పించకపోయినా, ప్రసాదాలు, ప్రత్యేక పూజల ధరలు పెంచేసినా భక్తులు భరించగలరేమో కానీ తాము స్వామివారికి, అమ్మవారికి భక్తితో సమర్పించుకొన్న కానుకలను అధికారులు అప్పనంగా తమ సౌకర్యాలు కల్పించుకోవడం కోసం వాడుకొంటే సహించడం కష్టం.
కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడంతో ఆయా జిల్లాలో దేవాదాయశాఖ కార్యాలయాలు, వాటిలో ఫర్నీచర్, లైట్లు, ఫ్యానులు, అధికారులకు ఏసీలు ఏర్పాటుచేసుకోవలసి వస్తోంది. వాటి కోసం దేవాదాయశాఖ నిధులు కేటాయించాలి. కానీ నిధులు లేనందున ఆలయాల సర్వశ్రేయోనిధి (సిజిఎఫ్) ఖాతా నుంచి అవసరమైన నిధులు తీసుకొని వాటితో కార్యాలయాలలో సౌకర్యాలు కల్పించుకోవాలని దేవాదాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
నిబందనల ప్రకారం సిజిఎఫ్ ఖాతాలోని నిధులను శిధిలావస్థకు చేరుకొంటున్న పురాతన ఆలయాలను పునరుద్దరించడానికి, అర్చకుల జీతాలకు, ధూపదీప నైవేధ్యాలకు మాత్రమే ఖర్చు చేయాలి. కానీ ఈ నిబందనను తుంగలో తొక్కి కొత్త జిల్లాలలోని దేవాదాయశాఖ పరిధిలోని ఆలయాలలో నుంచి విచ్చలవిడిగా డబ్బు డ్రా చేసుకొని వాడేసుకొంటున్నారు.
ఉదాహరణకి కొత్తగా ఏర్పడిన అనకాపల్లి జిల్లాలో నూకాలమ్మ ఆలయంలో సిజిఎఫ్ ఖాతా నుంచి రూ.6 లక్షలు, విజయనగరం పైడితల్లి అమ్మవారి ఆలయం నుంచి రూ.5 లక్షలు, అమలాపురంలోని వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి రూ.5 లక్షలు, మచిలీపట్నంలోని మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నుంచి రూ.8.50 లక్షలు, ఇంకా రాష్ట్రంలో పలు ఆలయాల నుంచి లక్షల రూపాయలు తీసి దేవాదాయ కార్యాలయాలలో సౌకర్యాల కొరకు ఖర్చు చేస్తున్నారు.
భక్తుల సొమ్ముకు ధర్మకర్తగా మాత్రమే వ్యవహరించాల్సిన ప్రభుత్వం..దానిలో అధికారులు, అది తమ సొంత సొమ్ము అన్నట్లు ఇష్టం వచ్చినట్లు తీసి ఖర్చు చేసేస్తుంటే ఏమనుకోవాలి?ఆలయాల మీద దేవాదాయశాఖ పేరుతో ప్రభుత్వం.. దానిని నడిపించే రాజకీయ నాయకులు పెత్తనం చేస్తుండటం వలననే ఈవిదంగా దుర్వినియోగం చేయగలగుతున్నారని చెప్పక తప్పదు.
దేవాలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాక రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చే బంగారుబాతుల్లా భావిస్తూ, భక్తులు సమర్పించిన కానుకలను తమ సౌకర్యాలకు ఖర్చు చేసుకోవడాన్ని ఎవరూ హర్షించలేరు.



