ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా సకాలంలో జీతాలు చెల్లించలేని దుస్థితిపై ఆయా సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల సంఘాలు ఆదివారం గుంటూరులో సమావేశమైనప్పుడు వాటి రాష్ట్ర అధ్యక్షుడు సూర్యనారాయణ మాట్లాడుతూ, “మిగిలిన రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చాలా మెరుగ్గా ఉందని, అభివృద్ధిరేటు బాగుందని సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు. అది నిజమని భావిస్తున్నాము. మరైతే ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు సకాలంలో ఎందుకు జీతాలు చెల్లించడం లేదు?మా డీఏ బకాయిలు చెల్లించడం లేదు. ఈ నెల 20వ తేదీ వస్తున్నా ఇంకా చాలా మందికి జీతాలు, పెన్షన్లు చెల్లించలేదు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని చెపుతున్నప్పుడు జీతాలు, పెన్షన్లు, డీఏ బకాయిలు ఆలస్యం చేస్తుండటాన్ని మేము ఏమని భావించాలి? ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా జీతాల చెల్లింపు ఆలస్యం చేస్తున్నట్లు అనుమానం కలుగుతోంది.
సజ్జల రామకృష్ణారెడ్డి చేత మాకు సమాధానాలు చెప్పిస్తూ ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి తెర వెనుక ఎందుకు దాక్కొంటున్నారు? ఈ జీతాల చెల్లింపు సమస్యపై నేరుగా ఆయన ఎందుకు స్పందించడం లేదు?ఆయన నెలకొకసారి అయినా సచివాలయంలో మాతో సమావేశమయ్యి, మా సందేహాలను నివృత్తి చేయాలని కోరుతున్నాము.
ఈ మూడున్నరేళ్ళలో ప్రభుత్వంలో ఏ శాఖలో ఉద్యోగి కూడా సంతోషంగా లేడు. ప్రభుత్వం కోసం పనిచేస్తున్న మాతోనే ప్రభుత్వం ఈవిదంగా చలగాటమాడుతూ మమ్మల్ని చాలా ఇబ్బందులకి గురిచేస్తోంది. దీనిని మేము ఖండిస్తున్నాము. ఈసారి 12వ పీఆర్సీని 2023, జూలై నుంచి అమలుచేయాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ నుంచే మేము కార్యాచరణ ప్రకటిస్తాము,” అని హెచ్చరించారు.
వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పధకాల కోసం ఎడాపెడా అప్పులు చేస్తోందని చివరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా శ్రీలంకలా దివాళా తీస్తుందని టిడిపి, జనసేనలు విమర్శిస్తే సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డిలతో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు శాసనసభ సమావేశాలలో వారిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి చాలా భేషుగ్గా ఉందని కానీ ప్రతిపక్షాలు పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తూ తమ ప్రభుత్వంపై బురద జల్లుతున్నాయని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కనుక ప్రభుత్వోద్యోగ సంఘాల నేతలు ఇప్పుడు అదే గుర్తు చేసి మరి జీతాలు ఎందుకు ఆలస్యం అవుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. మరి వీటికి సిఎం జగన్, ఆర్ధిక మంత్రి బుగ్గన ఏమని సమాధానం చెపుతారో?




