ఏపీలోని వైసీపీ ప్రభుత్వం తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలపై ఉన్న కేసులను ఉపసంహరించుకొంటూ జీవో జారీ చేయడంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంపై దాఖలైన ఇతర పిటిషన్లతో బాటు హైకోర్టు స్వయంగా ఈ కేసును సుమోటూగా స్వీకరించి నేడు విచారణ చేపట్టింది.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్, జస్టిస్ సోమయాజులుతో కూడిన ద్విసభ్య ధర్మాసనం నేడు విచారణ చేపట్టినప్పుడు, వైసీపీ ప్రభుత్వం తీరుపై న్యాయమూర్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజాప్రతినిధులపై కేసులున్నప్పుడు సుప్రీంకోర్టు, హైకోర్టు అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోకూడదు. కానీ ఏపీ ప్రభుత్వం మాకు తెలియజేయకుండా, మా అనుమతి తీసుకోకుండానే వైసీపీకి చెందిన ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరించుకొంటూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని మేము కోర్టు ధిక్కారంగానే భావిస్తున్నాము. ఈసారి మా అనుమతి తీసుకోకుండా కేసులు ఎత్తివేస్తే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి,” అని గట్టిగా మొట్టికాయలు వేసింది. దీనిపై రెండు వారాలలో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ హైకోర్టు తదుపరి విచారణను వాయిదా వేసింది.
రాష్ట్ర ప్రభుత్వం జగ్గయ్యపేట వైసీపీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, మరికొందరు ప్రజాప్రతినిధులపై కేసులను ఉపసంహరిస్తూ జీవో జారీ చేసింది. దానిపైనే నేడు హైకోర్టు విచారణ చేపట్టి జగన్ ప్రభుత్వానికి గట్టిగా మొట్టికాయలు వేసింది. అధికారంలో ఉన్నవారు ఏమీ చేసినా చెల్లుతుందనే ధీమాతో వ్యవహరిస్తుంటారు. ఒకవేళ తమపై కేసులు నమోదైనా తమ ప్రభుత్వమే అధికారంలో ఉంది కనుక ఎవరూ తమ జోలికి రారని, వాటి నుంచి సులువుగా బయటపడవచ్చనే గట్టి నమ్మకంతో ఉంటారు. అందుకే యధేచ్చగా వ్యవహరిస్తుంటారు. కానీ హైకోర్టు కూడా ‘నేనున్నాను… నేను చూస్తున్నాను,” అని గట్టిగా హెచ్చరించింది.



