వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మళ్ళీ మొట్టికాయలు.. అయినా తగ్గేదేలే!

Andhra_Pradesh_High_Courtప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించలేవు కానీ తమ పార్టీలో రాజకీయనిరుద్యోగులకు పదవులు ఇవ్వగలవు. ఒకవేళ ఖాళీ లేకపోతే కొత్త పదవులు సృష్టించి ఇవ్వగలవు. ప్రభుత్వ సలహాదారు పదవులు అటువంటివే. అవికాక పార్టీ కార్యకర్తల కోసం వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను సృష్టించి ఉద్యోగాలు కల్పించడం అందరూ చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వ శాఖలకు వేరేగా సలహాదారులు నియమించడం ప్రారంభించింది. దేవాదాయశాఖకు జ్వాలాపురపు శ్రీకాంత్‌ను నియమిస్తూ ఈ నెల 5న ప్రభుత్వం జీవో నంబర్ 630ని జారీ చేసింది.

ADVERTISEMENT

దీనిని ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్య అధికార ప్రతినిధి హెచ్‌కె రాజశేఖర రావు రాష్ట్ర హైకోర్టులో సవాలు చేస్తూ పిటిషన్‌ దాఖలు చేశారు. దానిపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్‌ మిశ్రా, జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ద్విసభ ధర్మాసనం బుదవారం విచారణ చేపట్టింది.

పిటిషనర్‌ తరపు న్యాయవాది వేదుల వెంకటరమణ వాదిస్తూ, “జ్వాలాపురపు శ్రీకాంత్‌ను దేవాదాయ సలహాదారుగా నియమించడం దేవాదాయ చట్ట నిబందనలకు విరుద్దం. సలహాదారుగా నియమించడానికి ఆయనకు ఏమి అర్హతలు, అనుభవం ఉన్నాయో ప్రభుత్వం జీవోలో వివరించలేదు. ఆయనకు ప్రోటోకాల్ సౌకర్యాలు, నెలకు రూ.1.6 లక్షలు జీతం ప్రభుత్వం చెల్లించబోతున్నట్లు పేర్కొంది. దేవాదాయశాఖకు కార్యదర్శులు, అనేకమంది అధికారులు ఉండగా మళ్ళీ కొత్తగా ఈ సలహాదారు అవసరం ఏమిటి?అంటే వారు దేవాదాయశాఖను సమర్దంగా నిర్వహించలేని అసమర్దులని ప్రభుత్వం భావిస్తోందా?దేవాదాయశాఖపై ప్రభుత్వం ఈ అదనపు ఆర్ధికభారం ఎందుకు మోపుతోంది?” అని ప్రశ్నించారు.

ఈ కేసులో ప్రభుత్వం తరపున హాజరైన అడ్వకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్, జ్వాలాపురపు శ్రీకాంత్‌ నియామకాన్ని సమర్ధించుకొంటూ వాదించబోగా హైకోర్టు ధర్మాససనం అడ్డుకొని, “ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి మీరు నియమింపబడ్డారు. రేపు ప్రభుత్వం మీకూ ఓ సలహాదారుని నియమిస్తానంటే ఒప్పుకొంటారా?ముఖ్యమంత్రికి, మంత్రులకు సలహాదారులు ఉన్నారు. మళ్ళీ ప్రభుత్వశాఖలకు కూడా సలహాదారులను నియమించాల్సిన అవసరం ఏమోచ్చింది?పిటిషనర్ ప్రశ్నలకు మీ సమాధానం ఏమిటి?ఈ సలహాదారుల నియామకాలు చాలా అతిగా ఉన్నాయి. ఈ వ్యవహారంపై లోతుగా పరిశీలించాల్సి ఉంది. జ్వాలాపురపు శ్రీకాంత్‌ నియామకంపై ప్రభుత్వం జారీ చేసిన జీవోపై స్టే విధిస్తున్నాము,” అని చెపుతూ ఈ కేసు తదుపరి విచారణను అక్టోబర్ 19కి వాయిదా వేసింది. ఈ కేసులో ప్రతివాదులుగా పేర్కొనబడిన దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, కమీషనర్, జ్వాలాపురపు శ్రీకాంత్‌లను కౌంటర్ దాఖలు చేయవలసిందిగా ఆదేశిస్తూ హైకోర్టు ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది.

వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టులో మొట్టికాయలు పడటం ఇది మొదటిసారీ కాదు ఆఖరిసారి కాదు. ఎన్నిసార్లు మొట్టికాయలు పడుతున్నా వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గేదేలే… అంటూ మళ్ళీ మళ్ళీ మొట్టికాయలు వేయించుకొంటూనే ఉండటం ఆశ్చర్యమే కదా?

ADVERTISEMENT
Latest Stories