ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నూతన అసెంబ్లీ భవనాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అట్టహాసంగా ప్రారంభించారు. ఇక ఏపీ అసెంబ్లీలో మైకులు విరగ్గొట్టలేరని, స్పీకర్ పై దాడి చేయలేరని, అంత కట్టుదిట్టంగా అన్ని పనులు పూర్తి చేశామని ఛలోక్తులు విసిరారు. అమరావతిలో నిర్మించిన నూతన అసెంబ్లీ భవనాన్ని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… ప్రతిపక్ష నేతగా తాను ఎన్నో ఏళ్లు ఉన్నానని, కానీ తాము అలా అసెంబ్లీలో విచక్షణారహితంగా ప్రవర్తించలేదని అన్నారు.
అసెంబ్లీలో అర్థవంతమైన చర్చ జరగాలి కానీ ఇష్టానుసారంగా మాట్లాడకూడదని, హుందాగా ప్రవర్తించాలని హితవు పలికారు. ప్రశ్నించాలి, అడగాలి కానీ మైకులు విరగ్గొట్టేలా ప్రవర్తించకూడదని అన్నారు. తన ప్రతి నిమిషం, ప్రతి గంట రాష్ట్ర ప్రయోజనాల కోసమే పనిచేస్తానని, కలిసి వస్తే కలుపుకొని వెళతానని, కలిసి రాకపోయినా అభివృద్ధి పనుల విషయంలో వెనకడుగు వేయబోమని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలని అన్నారు. ఈ అసెంబ్లీ స్పెషాలిటీస్ ఇవే…
సచివాలయం ప్రాంగణంలోని రెండు ఎకరాల స్థలంలో అసెంబ్లీని నిర్మించారు.
ఒకే సముదాయంలోనే అసెంబ్లీ, సచివాలయాలను ఏర్పాటు చేశారు.
మొత్తం 260 మంది కూర్చునేలా అసెంబ్లీని నిర్మించారు.
90 మంది కూర్చునేలా శాసనమండలిని నిర్మించారు.
అసెంబ్లీలో స్పీకర్ ఛైర్ ను అత్యంత ఆకర్షణీయంగా ఏడు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు.
స్పీకర్ ఛైర్ కు ఇరు వైపులా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు.
సభ్యుల వద్ద సెన్సర్ మైక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో, మైకులు విరగ్గొట్టడం కుదరదు.
ముఖ్యమంత్రికి, స్పీకర్ కు ప్రత్యేక సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు.
అసెంబ్లీలో ఐదు అత్యాధునిక గ్యాలరీలు… మీడియాకు 2, అధికారులు, వీఐపీలకు, విజిటర్స్ కు ఒక్కో గ్యాలరీ కేటాయించారు.
ఈ భవనాలను రికార్డు సమయంలో ఎల్ అండ్ టీ, సీఆర్డీఏలు నిర్మించాయి.
సచివాలయం ప్రాంగణంలో ఇప్పటికే పలు భవనాలు ఉండగా, ఆరో భవనంగా అసెంబ్లీ, శాసనమండలిని నిర్మించారు.



