జన సేనాని పవన్ కళ్యాణ్ ఈరోజు ఏలూరు జిల్లా పర్యటనలో ఎప్పటిలాగే కొన్ని పంచ్ డైలాగులు, కొన్ని సునిశిత వ్యాఖ్యలు చేశారు. అలవాటులో పొరపాటు అన్నట్లు కొన్ని అసందర్భపు మాటలు కూడా మాట్లాడారు.
ముందుగా దత్తపుత్రుడు టాపిక్ మీద కాసేపు మాట్లాడి అభిమానులను ఉత్సాహపరిచారు. నన్ను మళ్ళీ దత్త పుత్రుడు అంటే నేనూ మిమ్మల్ని (సిఎం జగన్మోహన్ రెడ్డి)ని ‘సిబిఐ దత్త పుత్రుడు’ అని అనాల్సి వస్తుంది, అది మీకు, మీ అధినేతకు అంత గౌరవప్రదం కాదు కనుక ఆ పదం వాడవద్దని వైసీపీ నేతలకు సభాముఖంగా పవన్ కళ్యాణ్ సూచించారు.
“నా వల్ల పొరపాటు జరిగితే తప్పకుండా దిద్దుకొంటాను. ఇదివరకు పర్యటనలో నేను ‘చర్లపల్లి షటిల్ టీం’ అని నేను పొరపాటు మాట్లాడాను. కానీ అది చర్లపల్లి షటిల్ టీం కాదు…చంచల్ గూడా షటిల్ టీం అని నర్సాపురం ఎంపీగారు తెలియజేశారు. ఆ పొరపాటును సరిదిద్దుకొంటున్నాను,” అని చెప్పగానే పవన్ అభిమానులు ఈలలు, కేకలతో కాసేపు గోలగోల చేశారు.
నేను ఎవరికీ దత్తపుత్రుడిని కానని, కానీ ఎవరైనా దత్తత తీసుకొంటే నన్ను భరించలేరని పవన్ కళ్యాణ్ చెప్పడం తనను విమర్శించేందుకు వైసీపికి చేజేతులా అవకాశం కల్పించినట్లయింది.
అయితే కౌలురైతులు, ప్రభుత్వ బాధ్యత గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేస్తాయి. “ఓ పక్క నిత్యం కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే గ్రామ సచివాలయాలు, పంచాయితీలు, వైసీపీ కార్యకర్తలు, పార్టీ నేతలు ఇంతమంది ఉండి ఏమి చేస్తున్నారు?కౌలు రైతుల కన్నీళ్ళు తుడిచి, వారి కష్టాలను తీర్చుతాడనే కదా వారందరూ భారీ మెజార్టీతో వైసీపీని గెలిపించి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కల్పించారు?కానీ రాష్ట్రంలో మూడు వేలకు పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ప్రభుత్వం ఏమి చేస్తోంది?” అని నిలదీశారు.
“ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలననే కదా నేను వారి వద్దకు వెళ్ళవలసివస్తోంది. ప్రభుత్వమే వారికి అండగా నిలబడితే నేను ఇక్కడికి రావలసిన అవసరం ఏమిటి? వస్తే నా పార్టీ కార్యకర్తలను ఎందుకు అడ్డుకొంటున్నారు?వారిపై ప్రభుత్వం ఎందుకు దాడులు చేయిస్తోంది?మా సహనానికి ఓ హద్దు ఉంటుంది. ఇలాగే జనసేన కార్యకర్తలపై దాడులకు పాల్పడుతుంటే ఎదురుతిరగవలసి వస్తుంది,” అని పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలను, ప్రభుత్వాన్ని సూటిగా హెచ్చరించారు.



