కర్నూల్ జిల్లా, అమకతాడు టోల్గేట్ వద్ద పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అనుచరులు కర్రలతో వీరంగం సృష్టించారు. ఎమ్మెల్యే వాహనం టోల్గేట్ వద్దకు రాగా సిబ్బంది త్వరగా గేట్ తియ్యలేదని., ఎమ్మెల్యే వాహనంతో పాటు వచ్చిన అనుచరుల వాహనానికి అనుమతి నిరాకరించారని ఆగ్రహించిన అనుచరులు టోల్గేట్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
ఎమ్మెల్యే వాహనంతో పాటుగా తమ వాహనాలకు కూడా టోల్ రుసుమును రద్దు చేయాలంటూ సిబ్బందిపై కర్రలతో దాడిచేశారు. దాడిలో ఒక వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యారు. ఈ సంఘటనకు సంబంధించి సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఇంత జరిగినా ఎమ్మెల్యే అనుచరుల మీద కేసు నమోదు కాకపోవడమే కొసమెరుపు. గతంలో కూడా ఇదే తరహా ఘటనలు వైసీపీ నాయకుల నుండి టోల్ సిబ్బందికి ఎదురయ్యాయి.
ఈ సందర్భంగా.., తాడేపల్లి కాజా టోల్గేట్ వద్ద రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ రేవతి టోల్ సిబ్బంది మీద చెయ్యి చేసుకున్నఉదంతాన్ని., ఆమె అనుచరులు ఆ దృశ్యాలను చిత్రీకరిస్తున్న టోల్ సిబ్బంది ఫోన్ లాక్కుని దానిని నేలకేసికొట్టిన వైనాన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రజల ముందు ఉంచుతున్నారు. ప్రజలు అధికారం ఇచ్చింది ‘పాలన’ చేయడానికే కానీ, ‘పెత్తనం’ చేయడానికి కాదని రాజకీయ నాయకులు తెలుసుకునే రోజు రావాలంటూ ప్రజలు ఆశగా ఎదురచూస్తున్నారు.
ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన రాజకీయ నాయకులు ఇలా తమ అనుచరుల అత్యుత్సాహాన్ని అడ్డుకట్ట వేయకపోతే ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తుంది. నానాటికి పెరుగుతున్న పెట్రోల్ రేట్లతో అల్లాడుతున్న ప్రజలు విధిగా తమ వాహనాల టోల్గేట్స్ ని చెల్లిస్తుంటే అధికారంలో ఉన్న నాయకులు మాత్రం వారి వాహనాలకు., వారి సిబ్బంది., అనుచరుల., బంధువుల వాహనాలంటూ ప్రతి వాహనానికి ఈ విధంగా టోల్గేట్స్ రద్దు చేయాలని ఆశించడం దురదృష్టకరం అంటున్నారు సామాన్య ప్రజానీకం.



