వాలంటీర్లు 1వ తేదీ పొద్దునే వచ్చి చిర్నవ్వుతో అవ్వతాతలను ఆప్యాయంగా పలకరించి పింఛన్లు అందజేసేవారని గత 5 ఏళ్ళుగా జగన్ గొప్పగా చెప్పుకునేవారు. అయితే సుమారు రెండున్నర లక్షలమందికి పైగా వాలంటీర్లును అందుకు ఉపయోగించుకునేవారు. కానీ ఇప్పుడు టిడిపి కూటమి ప్రభుత్వం వాలంటీర్లని ఉపయోగించుకోకుండా, సచివాలయ సిబ్బందితోనే టంచనుగా 1వ తేదీన రూ.4,000 చొప్పున పింఛన్లు అందజేస్తోంది.
రేపు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగా నేడే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు పంపిణీ కార్యక్రమం జరుగుతుండటం మరో విశేషం.
పింఛన్లు చెల్లింపు వారం రోజులు ఆలస్యమైన ఎవరూ ప్రభుత్వాన్ని నిలదీయరు. కానీ వృద్ధులు, ఒంటరి మహిళలు, వికలాంగులు వాటిపైనే ఆధారపడి జీవిస్తున్నారనే మానవాతా దృక్పధంతో సిఎం చంద్రబాబు నాయుడు ముందుగా వారికి పింఛన్లు అందేలా చేస్తున్నారు.
సచివాలయ సిబ్బందితో 1వ తేదీనే పింఛన్లు పంపిణీ చేయిస్తూ వాలంటీర్లు లేకపోతే పింఛన్లు పంపిణీ సాధ్యం కాదనే వైసీపి వాదన అర్ధరహితమని నిరూపించారు.
జగన్ 1వ తేదీన పింఛన్లు అందిస్తున్నామని గొప్పగా చెప్పుకునేవారు. కానీ తన 5 ఏళ్ళ పాలనలో ఏనాడూ కూడా ఒకటవ తేదీన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు జీతాలు చెల్లించలేదు. ఇక పెన్షనర్లకు పెన్షన్ ఎప్పుడు పడుతుందో తెలీని పరిస్థితి నెలకొని ఉండేది.
కానీ టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వారికి కూడా 1వ తేదీన ఉద్యోగాలు పడుతున్నాయి. అంటే ప్రభుత్వానికి నిబద్దత, సరైన ఆర్ధిక విధానం, ఆర్ధిక క్రమశిక్షణ ఉంటే ఏదైనా సాధ్యమే అని సిఎం చంద్రబాబు నాయుడు నిరూపించిచూపుతున్నారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, ఆడపిల్లలకి భద్రత లేకుండా పోయిందని రోజుకో ఆరోపణ చేస్తూ ప్రభుత్వంపై బురద జల్లుతున్న వైసీపి ఈ పింఛన్లు, జీతాల చెల్లింపుల గురించి మాత్రం మాట్లాడదు. రాజధాని అమరావతి గురించి మాట్లాడదు. రాష్ట్రంలో ప్రారంభం కాబోతున్న అభివృద్ధి పనుల గురించి మాట్లాడదు. ఎందుకంటే వాటి గురించి మాట్లాడితే ముందు జగన్మోహన్ రెడ్డి తర్వాత వైసీపి నేతలే తల దించుకోవలసి వస్తుంది కనుక!
గత 5 ఏళ్ళలో తాము ఏమి చేయలేదో టిడిపి కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తోందిప్పుడు. కనుక జగన్ కనీసం ఇప్పుడైనా వాటిని చూసి నేర్చుకొని తన ఆలోచనా విధానం మార్చుకుంటే వైసీపికి మేలు చేసినవారవుతారు.




