ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి నేతలు, కార్యకర్తలతో ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే అసలు వాళ్ళు మనుషులు, ఈ రాష్ట్ర ప్రజలు కారని భావిస్తున్నట్లు అనిపిస్తుంది. ఈ మూడేళ్ళలో వైసీపీ ప్రభుత్వం అనేకమంది టిడిపి నేతలు, కార్యకర్తలను వేధిస్తుండటం అందరూ చూస్తూనే ఉన్నారు.
చిత్తూరు మాజీ మేయర్, నగర అధ్యక్షురాలు కఠారి హేమలత కాళ్ళపై నుంచి పోలీసులు జీపు నడిపించడం ఇందుకు మరో తాజా నిదర్శనంగా కనిపిస్తోంది. శుక్రవారం సాయంత్రం ఆమె చిత్తూరు ఏఎస్పీని కలిసి తన అత్త దివంగత కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్ హత్య కేసులో సాక్షులను కొందరు బెదిరిస్తున్నారని వారికి రక్షణ కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. ఆ కేసులో హేమలత అనుచరుడైన ప్రసన్న సాక్షిగా ఉన్నాడు.
సాక్షులకు రక్షణ కల్పించమని హేమలత పోలీసులకు విజ్ఞప్తి చేస్తే, ఆ సాక్షి తమ్ముడు పూర్ణ గంజాయి అక్రమరవాణా చేస్తున్నాడంటూ పోలీసులు అరెస్ట్ చేయడం విశేషం.
శుక్రవారం రాత్రి సుమారు 8 గంటలకు చిత్తూరు టూ టౌన్ పోలీసులు సంతపేటలో పూర్ణ ఇంటికి వెళ్ళి ఇంట్లో గంజాయి ఉందంటూ సోదాలు చేస్తున్నట్లు నటిస్తూ అతని ఇంట్లో ఓ బస్తా పెట్టబోతుంటే పూర్ణ తల్లి, వదిన అడ్డుకొన్నారు. దాంతో పోలీసులు పూర్ణను జీపులో ఎక్కించుకొని రాత్రి 11 గంటల సమయంలో ఓబనపల్లెలో ఉన్న అతని మరో ఇంటికి వెళ్ళి ఓ బస్తాను బలవంతంగా లోపల పెట్టారని పూర్ణ కుటుంబ సభ్యులు ఆరోపించారు.
ఈ విషయం తెలుసుకొన్న హేమలత తన అనుచరులతో కలిసి అక్కడకు చేరుకొని పోలీస్ జీప్ వెనుక ఖాళీగా ఉన్న ప్రదేశంలో బైటాయించి ధర్నా చేశారు. పూర్ణ ఇంట్లో గంజాయి బస్తా దొరికిందంటూ టూటౌన్ సీఐ యతీంద్ర అతనిని అరెస్ట్ చేసి జీపును రివర్స్ చేస్తున్నప్పుడు వెనుక హేమలత ఉందని తెలిసి ఉన్నప్పటికీ ఆమె కాళ్ళ మీదుగా జీపును నడిపించారని ఆమె అనుచరులు ఆరోపించారు.
హేమలత అనుచరులు వెంటనే ఆమెను స్థానిక హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఆమెకు ఎక్స్‌రే తీసి రెండు కాళ్ళ ఎముకలలో స్వల్పంగా పగుళ్ళు వచ్చాయని తెలిపారు. అర్దరాత్రి దాటిన తరువాత హేమలత తీవ్రమైన కడుపునొప్పి రావడంతో వైద్యులు ఆమెకు అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేశారు. ఒకవేళ అవసరమైతే వేలూరికి తరలించి అక్కడ చికిత్స చేయవచ్చని తెలుస్తోంది.
హేమలత అనుచరుల ఆరోపణలను టూటౌన్ సీఐ యతీంద్ర కొట్టిపాడేశారు. అసలు జీపు ఆమెను తాకనే లేదని అని చెప్పారు. మాజీ మేయర్ అనురాధ, మోహన్ దంపతుల హత్య కేసును నీరు గార్చేందుకే పోలీసులు సాక్షులను ఈవిదంగా అక్రమకేసులలో ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు. హేమలత కాళ్ళ మీదుగా జీపును నడిపించడం వారి దుర్మార్గాలకు పరాకాష్ట అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.



