ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలపై మరో బాదుడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ సారి తమ వంతంటూ ‘విద్యుత్ చార్జీలు’ ముందుకొచ్చాయి. ఇప్పటికే పవర్ కట్లతో గ్రామాలలో ప్రజలు అల్లాడుతున్నారు. వేసవికాలం భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు ఈ పెరిగిన విద్యుత్ చార్జీలతో మండిపడుతున్నారు.
రాష్ట్రంలో పెరిగిన విద్యుత్ చార్జీలు ఆగష్టు 1, 2022 నుంచి అమలులోకి వస్తాయని., బాధగా ఉన్న బాదుడు తప్పడం లేదని., గడిచిన 20ఏళ్లుగా చార్జీలు పెంచలేదని, డిస్కంలను కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని వెల్లడించారు ఏపీఈఆర్సీ అధికారి నాగార్జునరెడ్డి.
గత టీడీపీ హయాంలో ఎటువంటి విద్యుత్ కోతలు లేకుండా., కరెంట్ చార్జీలు పెంచకుండా తాము అధికారంలో ఉన్నంత కాలం 24 గంటలు నిరంతర విద్యుత్ సరఫరా చేశామని, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం ఆ పని ఎందుకు చేయలేకపోతుందంటూ నిలదీశారు టీడీపీ శ్రేణులు. పెంచిన విద్యుత్ చార్జీలను స్లాబుల రూపంలో విభజించి అన్ని స్లాబుల వారికి ఈ “బాదుడు పధకాన్ని” అందించారు ముఖ్యమంత్రి జగన్.
30 యూనిట్ల వినియోగం దగ్గర మొదలుపెట్టి 400 యూనిట్ల వినియోగం వరకు ఎవ్వరిని వదలకుండా ప్రజలందరికి మూకుమ్మడి కరెంట్ షాక్ ఇచ్చారు జగన్ అంటూ, అటు సామాన్యుడు మొదలు ఇటు ఉన్నత స్థాయి వర్గం వారు ప్రభుత్వం పై గుర్రుగా ఉన్నారు. పెంచిన చార్జీలతో జగన్ ప్రభుత్వం ప్రజలకు ఇప్పుడు షాక్ ఇచ్చింది. ఈ బాదుడు పథకాలను అందుకుంటున్న ప్రజలు ఈ ‘ఫ్యాన్’ కు కరెంట్ కట్ చేసి జగన్ కు షాక్ ఇచ్చే కాలం ఎంతో దూరంలో లేదంటున్నారు ప్రతిపక్ష పార్టీలు.
ధరలు, పన్నులు, చార్జీలు., అంటూ మీరు పెంచుకుంటూపోతే, మీ ఎమ్మెల్యే – ఎంపీ సీట్లను మేం తగ్గించుకుంటూ పోతాం అని అనుకోవడం రాష్ట్ర ప్రజానీకం వంతవుతోంది. చార్జీల పెంపు పేరుతో ప్రతి పేద వాడి ఇంటి ‘ఫ్యాన్’ ను మీ చేతులతో మీరే కట్ చేస్తున్నారని పేద, బడుగు వర్గాల ప్రజలు జగన్ ప్రభుత్వంపై అసహనంతో ఉన్నారు.
సినిమా టికెట్ ధరల విషయంలో జగన్ సర్కార్ రేపిన రచ్చ ఈ సందర్భంగా మరోసారి వెలుగు చూసి చర్చనీయాంశంగా మారింది. దీనికి తగ్గట్లే సినిమా టికెట్ ధరలను పెంచుతూ చాలా మేమ్స్ కూడా నెట్టింట సందడి చేసాయి. అందులో ఓ మేమ్ మాదిరి… బహుశా “ఆర్ఆర్ఆర్” సినిమా తర్వాత పేదవారంతా కుభేరులుగా మారిపోయారని అనుకున్నారో ఏమో? అని తలలు పట్టుకోవడం ఏపీ ప్రజల వంతు!



