ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ రేపు శనివారం ఉదయం 11 గంటలకు విజయవాడలో పదో తరగతి ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ విషయం స్వయంగా ఆయనే మీడియాకు, ఉపాధ్యాయ సంఘాల నేతకు తెలియజేశారు. గత నెల 3 నుంచి 18 వరకు పదో తరగతి పరీక్షలు జరుగగా రాష్ట్ర వ్యాప్తంగా 6.5 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. పదో తరగతి ఫలితాల గురించి చెప్పుకోగానే గత ఏడాది ఫలితాలు, జరిగిన కధలు అందరి కళ్ళముందు తప్పక మెదులుతాయి.
గత ఏడాది పదో తరగతి ఫలితాలలో కేవలం 67.26శాతం మంది విద్యార్థులు మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర విద్యావ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేసేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్న వైసీపీ ప్రభుత్వానికి ఈ ఫలితాలు పెద్ద షాక్ అనే చెప్పాలి. కానీ కరోనా కారణంగా రెండేళ్ళుగా విద్యార్థులు చదువులలో వెనకబడిపోయారని, గుజరాత్ కంటే ఏపీకి ఒక్క శాతం ఎక్కువే వచ్చిందంటూ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చక్కగా సమర్ధించుకొన్నారు.
అదే సమయంలో… మాస్ కాపీయింగ్, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కూడా బయటపడటంతో తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకొనేందుకు మద్యలో నారాయణా విద్యాసంస్థలపై ఆరోపణలు చేస్తూ, ఆ సంస్థల అధినేత నారాయణను హైదరాబాద్ నుంచి నాటకీయంగా అరెస్ట్ చేసి పెద్ద కధ నడిపించిన సంగతి బహుశః అందరికీ గుర్తుండే ఉంటుంది. కానీ నారాయణను దోషి అని ప్రభుత్వం నిరూపించలేకపోయింది.
ఈసారి కరోనా లేదూ… అదృష్టవశాత్తు మాస్ కాపీయింగ్ జరగలేదు… ప్రశ్నాపత్రాల లీక్ అవలేదు. పైగా గత ఏడాది కంటే ఈసారి విద్యావ్యవస్థను ప్రభుత్వం మరింత ప్రక్షాళన చేసేసి సంస్కరించేసింది కనుక ఈసారి కనీసం 95% పైన లేదా నూటికి నూరు శాతం ఉత్తీర్ణత వస్తుందని ఆశిద్దాం. ఒకవేళ గత ఏడాది ఫలితాలే ఈసారి కూడా పునరావృతమైతే, ఈసారి విద్యామంత్రిగారు ఏ కొత్త కధలు చెపుతారో వినడానికి అందరూ సిద్దంగా ఉండాలి.



