అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఎప్పుడు తన అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్లు చెప్పడం ఆయన సహజ సిద్ద శైలి. తాజా రాష్ట్ర రాజకీయ పరిణామాలపై కూడా జేసీ తన స్పందనను తెలియచేసారు. జనసేన అధినేత పవన్ సంకల్పించిన కౌలు రైతు భరోసా పుణ్యమా అంటూ వైసీపీ ప్రభుత్వంలో చలనం వచ్చిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చనిపోయిన ఒక్కో రైతు కుటుంబానికి 7 లక్షల ఆర్ధిక సాయాన్ని ప్రకటించి కొంతమంది రైతుల కుటుంబాలకు ఆ మొత్తాన్ని అందచేయడం జరిగింది అంటూ ఇప్పటివరకు ‘నిర్లక్ష్యపు మత్తు’లో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని పవన్ నిద్రలేపారంటూ కొనియాడారు. పవన్ కళ్యాణ్ యాత్రల పేరుతో తిరిగితేనే ప్రభుత్వానికి తమ నిర్లక్ష్యం విలువ తెలుస్తుందా? అంటూ జేసీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల మేలు కోసం ఆలోచిస్తున్నాను కాబట్టే పవన్ ను నా నియోజక వర్గంలో కూడా పర్యటించాలని, అవసరమైతే నా సొంత ఖర్చుతో బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టిస్తాను, అప్పుడైనా ఇక్కడి ప్రాంత కౌలు రైతులకు వైసీపీ ప్రభుత్వం వల్ల న్యాయం జరుగుతుందని ఆశపడుతున్నట్లుగా జేసీ చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంలోనే ఆయన ప్రజలకు కూడా “ఉచితాల” మీద ఉండే మత్తుని తొలగించే ప్రయత్నం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల “ఫ్రీ” అనే ‘మత్తు పథకాలకు’ ప్రజలు బానిసల్లా మారి ప్రభుత్వంపై తమ వ్యతిరేకతను చాటలేకపోతున్నారని, ఇలా అయితే రాష్ట్రంలో రానున్న రోజులు మరింత కష్టతరంగా మారతాయని ప్రజల ‘నిర్లక్ష్యపు మత్తు’ నిద్రను తట్టి లేపే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ఆర్ధిక విధానాలతో రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజానీకానికి కలగబోయే ఆర్ధిక సంక్షోభాలను తెలియచెప్పవలసిన బాధ్యత మీడియాపై ఉందని మీరు కూడా కొన్ని రోజుల పాటు రాజకీయ పార్టీల కోసం కాకుండా ప్రజల బాగు కోసం పని చేయాలంటూ మీడియాకు పట్టిన “రంగుల మత్తుని” వదలాలంటూ మీడియా మిత్రులకు కూడా సలహాలిచ్చారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే విద్యుత్ చార్జీల పెంపు, విద్యుత్ కోతలు, పెరిగిన నిత్యావసరాలు, దేశంలోనే మన రాష్ట్ర (జీడీపీ) ‘జీ’ ఫర్ గ్యాస్., ‘డీ’ ఫర్ డీజిల్, ‘పీ’ ఫర్ పెట్రోల్ అత్యధిక రేటులో నడుస్తుందన్నారు. చివరకు తిరుమల వెంకన్న భక్తుల దర్శన వసతుల కల్పనలోను వైసీపీ నాయకుల నిర్లక్ష్యపు మత్తు జాడలే తాండవిస్తున్నాయన్నారు. వైవీ సుబ్బారావు టీటీడీ అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నంత కాలం వెంకన్న భక్తులకు ఈ ఇక్కట్లు తప్పవన్నారు.
రాష్ట్ర భవిష్యత్తుని కాంక్షించి జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పినట్లు ప్రభుత్వం., ప్రజలు., మీడియా తమ “నిర్లక్ష్యపు మత్తుని” వీడి భావితరాల బాగు కోసం తమ స్వార్దాలను వదిలి ముందడుగు వేయాలని ఆశించడం అత్యాశే అవుతుందేమో అంటున్నారు సామాజిక వేత్తలు.



