వైసీపీ బయోపిక్..! “ఇచ్చట ప్రజలతో సంబంధం లేదు”

YSRCP YS Jaganప్రజలకు, సమాజానికి సేవ చేయటమే పరమావధిగా భావించి రాజకీయాలలో అడుగుపెడుతున్నాం అని చెప్పడంతోనే రాజకీయ నాయకుల “రాజకీయం” మొదలవుతుంది. “రాజకీయాలలో వైసీపీ రాజకీయాలు వేరయ్యా” అన్న తీరుగా ఇక్కడ కధ నడుస్తూ ఉంటోంది. “నేనే రాజు., నేనే మంత్రి.,” అన్న చందంగా మంత్రులు ఎవరైనా అధికారం మాత్రం రాజుదే., అని బయట ‘టాక్’ నడుస్తోంది.

“గెలిచే వరకు ప్రజలే దేవుళ్ళు – గెలిచాక ప్రజలే బానిసలు.,” “పదవి పొందే వరకు అధిష్టానానికి భక్తులం., పదవి పొందితే బానిసలం., పదవి పొందలేకపోతే అధిష్టానానికే శత్రువులం” ఇదే వైసీపీ సిద్ధాంతంలా మారినట్లుంది. పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి దగ్గర నుండి వైసీపీ నాయకుల వరకూ అందరిదీ ఒకటే నినాదం.

ADVERTISEMENT

వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠాత్మరణంతో రాష్ట్రంలో ఏర్పడిన పరిణామాలతో సీఎం పదవి తనకే దక్కుతుందని ఆశలు పెట్టుకున్న జగన్, ముందు అధిష్టానానికి ‘భక్తుడిలా’ వ్యవహరించారు. అయితే ఊహించని పరిణామాలతో కాంగ్రెస్ తన ఆశలపై నీళ్లు చల్లడంతో, అధిష్టానానికి “ఫ్యాన్” పోటు పొడిచి వారికే ‘శత్రువులా’ మారారు జగన్.

“ఆవు చేలో మేస్తే.., దూడ గట్టున మేస్తుందా.,” అన్న సామెత వైసీపీ పార్టీకి., ఆ పార్టీ నాయకులకు చక్కగా సరిపోయేలా కనపడుతోంది. కాంగ్రెస్ పార్టీకి., సోనియా గాంధీకి ఇచ్చిన ‘ఫ్యాన్ పోటు’ పధకాన్ని ఇచ్చిన జగన్ కు, ఇప్పుడు ఆయన పార్టీ నేతలే తిరిగి అప్పచెప్తున్నారు. పదవి వచ్చేవరకు అసెంబ్లీలో ప్రజా సమస్యలను గాలికొదిలి, జగన్ ”భజన కార్యక్రమాలు” చేస్తూ భక్తులుగా ప్రజల్లో పేరు సంపాదించారు.

భజన ప్రోగ్రామ్స్ లో టాపర్స్ కు జగన్ మంత్రి పదవులతో అవకాశం కల్పించినట్లుగా ఉంది. మంత్రి పదవులు పొందిన వైసీపీ నాయకులు తమ అధిష్టానానికి మోకరిల్లుతూ., పాదాభివందలను చేస్తూ ఇక మేము మీ బానిసలం దొరా..! అన్న చందంగా వ్యవహరించడం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. ‘బాహుబలి’ సినిమాలో ప్రభాస్ – కట్టప్ప పిక్స్ తో మీమ్స్ రెడీ చేస్తున్నారు నెటిజన్లు.

ఏపీ హోమ్ మినిస్టర్ గా పదవి బాధ్యతలు అందుకున్న తానేటి వనితా., వైసీపీ ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందిన రోజా., జోగి రమేష్., ప్రెసిడెంట్ మెడల్ మంత్రిగా పేరు పొందిన నారాయణస్వామి., అమర్ నాధ్., సిదిరి అప్పలరాజు., ఇలా మంత్రి పదవులు పొందిన వైసీపీ ఎమ్మెల్యేలు తమ వయస్సుని కూడా లెక్కచేయకుండా జగన్ కాళ్ళపై పడి మోకరిల్లడం చూస్తున్న ప్రజలకు రాజకీయ నాయకుల పదవికాంక్ష ఏపాటిదో తెలియచెప్పారు.

ఈ రాజకీయ నాయకులు “అందితే జుట్టు అందకపోతే కాళ్లు” అన్న చందంగా పదవి ఇస్తే “అతి వినయం.,” పదవి పీకితే “అంధకారం” అన్నట్లుగా ప్రవర్తించడం పరిపాటిగా మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో గెలవడానికి ప్రతి ఇంటి గడప తొక్కి., గెలిచాక తమ ఇంటి గడప ఎవరు తొక్కకుండా చూసుకునే వాడే నిజమైన వైసీపీ నాయకుడు అంటున్నారు రాష్ట్ర ప్రజానీకం.

రాజధాని లేక., కరెంట్ రాక., పరిశ్రమలు పెట్టక., ఉద్యోగాలు ఇవ్వక., పన్నుల భారం మోయలేక., నిత్యావసరాల ధరలను భరించలేక.,”దినదిన గండం నూరేళ్ళ ఆయుష్షు” లెక్కగా రాష్ట్ర ప్రజల స్థితిగతులు మారిపోయాయి. రోజుకో సమస్యతో ప్రజలు అల్లాడుతుంటే పట్టించుకోని ఈ వైసీపీ నేతలు ఇప్పుడు తమకు మంత్రి పదవి రాలేదనో., ఉన్న పదవి ‘పీకే’శారనో., రోడ్ల మీదకు వచ్చి చేస్తున్న ఈ రాద్ధాంతం., వారి వారి సిద్దాంతంలో., భాగమే అంటున్నారు రాజకీయ పరిశీలకులు.

పదవి ఇవ్వకపోతే అధిష్టానానికి ‘ఫ్యాన్’ పోటుతో సమాధానం ఇవ్వడం ఆ పార్టీ “డిఎన్ఏ”లో ఒక భాగమే అంటున్నారు టీడీపీ నేతలు. వైసీపీ పుట్టుకకు కారణం ‘పదవి వ్యామోహం’లో భాగమే! ప్రజా తీర్పుతో ఎన్నికై, చివరికి పదవులుంటే ప్రజలతో సంబంధం లేదంటారు కొందరు నేతలు. పదవి లేకపోతే ప్రజలకు సేవ చేయలేమని నిరసనలకు దిగుతారు మరికొందరు నేతలు. ఇంతకీ పదవుల కోసం ప్రజలా? ప్రజల కోసం పదవులా?

చివరకు ఈ వైసీపీ నేతల రాజకీయ క్రీడలో గెలిచేది ‘రాజకీయం,’ ఓడేది ‘ఓటరు’ అనేది ప్రజలు గ్రహించాల్సిన ముఖ్య విషయం. “ఇక్కడ పదవులకు తప్ప, ప్రజలకు ప్రాధాన్యం ఉండదు” అనే విధంగా వైసీపీ రాజకీయం సాగుతుండడం శోచనీయం. ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజు కొత్త మంత్రులందరూ కాళ్ళు మ్రొక్కే కార్యక్రమాన్ని అయితే విజయవంతంగా పూర్తి చేసారు.

ADVERTISEMENT
Latest Stories