ఎంపీ రఘురామకృష్ణంరాజు Vs ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిల యుద్ధం నెవెర్ ఎండింగ్ టైపులో కనపడుతోంది. తనను ఓ రోగ్ గా అభివర్ణిస్తూ సీఎం రాసిన లేఖ పట్ల మిక్కిలి ఆగ్రహంతో ఉన్న ఆర్ఆర్ఆర్ అసలు రోగ్ ఎవరు తేల్చేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతిలో ఓ పోల్ నిర్వహించారు. అయితే ఈ పోల్ లో తనకు డిపాజిట్ కూడా దక్కలేదని వాపోయారు ఆర్ఆర్ఆర్.
నేడు నిర్వహించిన రచ్చబండలో భాగంగా ఈ పోల్ రిజల్ట్ ను తెలియజేసారు. ఈ పోల్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి 91 శాతం ఓటింగ్ ను సొంతం చేసుకోగా, తనకు కేవలం 9 శాతం మాత్రమే ఓటు వేసి డిపాజిట్లు గల్లంతు చేసారని పేర్కొన్నారు. ఒకవేళ సాక్షిలో ఈ పోలింగ్ నిర్వహించినా ఇదే అభిప్రాయం వస్తుందని, వాళ్లయితే ఇలాంటి పోల్ ను నిర్వహించలేదని అన్నారు.
ఇక నేడు డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన కసిరెడ్డి రాజేంద్రనాధ్ రెడ్డికి తొలిరోజే అగ్నిపరీక్ష ఎదురయ్యిందని చెప్తూ విజయవాడ ఉదంతాన్ని ప్రస్తావించారు. విజయవాడ, కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వైసీపీ ఎంపీ సృష్టించిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ, తొలిరోజే డీజీపీ తనను తాను నిరూపించుకోవాల్సి వచ్చిందని అభిప్రాయపడ్డారు.
అటు అధికార పార్టీ వైపు కాకుండా, ఇటు ప్రతిపక్షం వైపు కాకుండా చట్టానికి లోబడి విధులు నిర్వహిస్తే సబబుగా ఉంటుందన్న భావనను రఘురామకృష్ణంరాజు వ్యక్తపరిచారు. వైఎస్ వివేకా హత్య కేసులో దస్తగిరి అప్రూవర్ గా మారడాన్ని సవాల్ చేసిన ఎర్ర గంగిరెడ్డి, ఉమాశంకర్ రెడ్డిల పిటిషన్ కొట్టివేయడంతో, అసలు సినిమా ముందుందని, నాడు ఒక్కొక్కళ్ళు ఎంతగా నటించారో అంటూ వివేకా హత్యోదంతాన్ని ప్రస్తావించారు.
ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి… తాడేపల్లిలో మంచు కురిసిందంటూ, జగన్ వద్దకు విచ్చేసిన విష్ణును ఉదహరిస్తూ పోల్చారు. తాను వ్యక్తిగతంగా వచ్చి కలిసానని, తనకు వరుసకు బావ అవుతాడని, అయినా అన్న అని పిలుస్తానని చెప్పిన విష్ణు మాటలను ప్రస్తావిస్తూ, వారిద్దరి రొమాన్స్ ఇప్పుడు ఎందుకులే గానీ, వ్యక్తిగతంగా కలిసినపుడు సినిమాల గురించి మాట్లాడకూడదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
తన అభిమాన హీరో పవన్ కళ్యాణ్ సినిమా “భీమ్లా నాయక్” రిలీజ్ డేట్ ఇచ్చేసారు, మీరు టికెట్ ధరలను పెంచాలి, ఒకవేళ పెంచకపోయినా చిరంజీవిలాగా ఈయన ఆర్జించే వ్యక్తి కాదు, గర్జించే వ్యక్తి అంటూ పవన్ కళ్యాణ్ ను కొనియాడారు. ఫిబ్రవరి 25 వరకు ఏదొక తాత్సారం చేసి టికెట్ ధరలను పెంచకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం శతవిధాలా ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.



