తెలంగాణ ఎన్నికలలో ఆంధ్రా ఓటర్లు ఎటువైపో?

Andhra Settlers Vote In Telangana

ఈ నెల 30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. గత రెండు ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి మొగ్గు చూపిన తెలంగాణ ప్రజలు ఈసారి బిఆర్ఎస్, కాంగ్రెస్‌ పార్టీల మద్య ఊగిసలాడుతున్నట్లు సర్వేలు సూచిస్తున్నాయి. బిఆర్ఎస్ నేతలు తెలంగాణ అభివృద్ధిని చూసి ఓట్లు వేయమని కోరుతుంటే, కేసీఆర్‌ కుటుంబ పాలన, అవినీతి, అక్రమార్జనలకు అడ్డుకట్ట వేసేందుకు తమకే ఓట్లు వేయాలని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కోరుతున్నాయి. కనుక వాటి ఆధారంగానే తెలంగాణ ప్రజలు నిర్ణయం తీసుకొంటారని భావించవచ్చు.

అయితే హైదరాబాద్‌తో సహా తెలంగాణలో పలు జిల్లాలలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లు కూడా ఈ మూడు పార్టీల భిన్న వాదనలతో పాటు ఆంధ్రాలో రాజకీయాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఓట్లు వేస్తారు.

ADVERTISEMENT

ఆంధ్రా ఓటర్లు కాంగ్రెస్‌కే మొగ్గు ఎందుకంటే…

చంద్రబాబు నాయుడు అరెస్టు ప్రభావం వారిపై చాలానే ఉంటుంది. కేసీఆర్‌ లేదా కేటీఆర్‌ ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఇంతవరకు కూడా ఖండించలేదు. కనుక వారు సమర్ధిస్తున్నట్లే. కనుక ఈ ఒక్క కారణం వల్లనే ఆంధ్రా ఓటర్లలో చాలామంది ఈసారి బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు ఓట్లు వేసే అవకాశం ఉంది.

టిడిపి ఈసారి ఎన్నికల నుంచి తప్పుకోవడం ద్వారా పరోక్షంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లే అందరూ భావిస్తున్నారు. అదీగాక… తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తేనే ఏపీలో ప్రభుత్వం కూడా మారేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నవారు అందరూ కాంగ్రెస్‌కే ఓట్లు వేయవచ్చు.

వైఎస్ షర్మిల కూడా కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటించడంతో వైసీపి అభిమానులు, ముఖ్యంగా రెడ్డి, తదితర అగ్రకులాలవారు కాంగ్రెస్‌కు మొగ్గు చూపవచ్చు. నేటికీ కాంగ్రెస్‌లో రెడ్డి సామాజిక వర్గానిదే పెత్తనం చేస్తుండటం కూడా ఇప్పుడు కాంగ్రెస్‌కు కలిసి రాబోతోంది.

బిఆర్ఎస్ పార్టీకే ఆంధ్రా ఓటర్లు మళ్ళీ జై ఎందుకంటే…

తెలంగాణలో స్థిరపడిన ఆంధ్రా ఓటర్లందరూ గుడ్డిగా కాంగ్రెస్‌ పార్టీకే ఓట్లు వేసేస్తారని కూడా చెప్పలేము. న్యూట్రల్ ఆంధ్రా ఓటర్లు బిఆర్ఎస్ పార్టీకే మొగ్గు చూపవచ్చు. ఎందుకంటే వారిది, వారి పిల్లల భవిష్యత్‌ అంతా తెలంగాణలోనే. కనుక తెలంగాణను అభివృద్ధి చేస్తునందుకు బిఆర్ఎస్ పార్టీకే ఓట్లు వేసేవారూ చాలా మందే ఉంటారు. గత రెండు ఎన్నికలలో వారు అదే చేశారు. ఇప్పుడూ అదే చేయవచ్చు. కానీ రాజకీయ కారణాలను పరిగణనలోకి తీసుకొనే ఐ‌టి ఉద్యోగులు కాంగ్రెస్‌ వైపు, ఉద్యోగాలు, భవిష్యత్‌ గురించి ఆలోచించేవారు బిఆర్ఎస్ పార్టీవైపు మొగ్గు చూపవచ్చు.

జనసేన ప్రభావం ఓట్లు చీల్చడం వరకే?

ఈసారి జనసేన కూడా బరిలో దిగుతోంది. అయితే రాజకీయాలలో, ఎన్నికలలో కొమ్ములు తిరిగిన బిఆర్ఎస్‌, కాంగ్రెస్‌ అభ్యర్ధులతో పోటీ పడి జనసేన గెలవడం అసాధ్యం కానీ ఎంతో కొంత ఓట్లు చీల్చగలుగుతుంది. కూకట్‌పల్లిలో ఓట్లు చీలితే మొదట నష్టపోయేది అధికార బిఆర్ఎస్ అభ్యర్ధి మాధవరం కృష్ణారావు కావచ్చు.

ఆంధ్రా ఓటర్లు బీజేపీకి నోనోనో…

ఆంధ్రప్రదేశ్‌ దుస్థితికి, చంద్రబాబు నాయుడు అరెస్టుకి బీజేపీయే మూలకారణం అని నమ్ముతున్నారు. ఆంద్రా ఓటర్లలో ఏ ఒక్కరూ కూడా బహుశః బీజేపీకి మొగ్గు చూపకపోవచ్చు.

ADVERTISEMENT
Latest Stories