కేసు ఏదైనా.. ఫార్ములా ఉందిగా!

Any Case One Formula: Anticipatory Bail Petition

ఏ శుభకార్యమైనా గణపతి పూజతో మొదలుపెట్టి అసలు పూజలోకి వెళ్తాము. అదే విదంగా ఏ కేసులోనైనా నోటీసులతో మొదలుపెడతారు కానీ అసలు కేసులోకి వెళ్ళక ముందే ‘ముందస్తు బెయిల్‌ పిటిషన్ల’తో విచారణకు బ్రేకులు పడుతుంటాయి. ఏపీ మద్యం కుంభకోణం కేసులో కూడా అదే జరుగుతోంది.

ఈ కేసులో జగన్‌ సిఎంవో కార్యదర్శి ధనుంజయ్ రెడ్డి (ఏ31), జగన్‌ ఓఎస్‌డి కృష్ణ మోహన్ రెడ్డి (ఏ32), భారతి సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ (ఏ33) ముగ్గురి పేర్లను ఛార్జ్-షీట్‌లో నిందితులుగా చేర్చగానే ,ముగ్గురూ ఆలస్యం చేయకుండా మొదట హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్లు వేశారు.

ADVERTISEMENT

వాటిపై హైకోర్టు విచారణ జరుపుతుండగానే ముగ్గురూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. కానీ హైకోర్టులోనే తేల్చుకోమని తిప్పి పంపేసింది. హైకోర్టు తిరస్కరించిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు.

కానీ ఇదివరకు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్లని పరిగణనలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరిస్తూ ఈ కేసు తదుపరి విచారణని మే 13కి వాయిదా వేసింది.

కనీసం అంతవరకైనా తమకు రక్షణ కల్పించాలని పిటీషనర్స్ తరపున న్యాయవాదుల అభ్యర్ధనని జస్టిస్ పార్దీవాలా ధర్మాసనం తిరస్కరించింది.

హైకోర్టు, సుప్రీంకోర్టులో ఈ ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ కేసులను చూస్తున్నప్పుడు, ఈ లెక్కన మద్యం కుంభకోణం కేసులో వీరి ముగ్గురినీ ప్రశ్నించే అవకాశం సిట్ అధికారులకు ఎప్పుడు లభిస్తుంది?అనే సందేహం కలుగక మానదు.

వేలు, లక్షల కోట్ల అవినీతి కేసులు, రాజకీయ హత్యల కేసుల విచారణ ఈవిదంగా మూడడుగులు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతుంటే, నిందితులు శిక్షలు పడకుండా తప్పించుకుంటుంటే, వ్యవస్థల వైఫల్యమే అని భావించాల్సి ఉంటుంది.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎంత హడావుడి జరిగిందో చివరికి ఏవిదగా అటకెక్కిపోయిందో అందరూ చూశారు. బహుశః ఇప్పుడు ఏపీ లిక్కర్ స్కామ్ కేసు కూడా ఆవిధంగానే ముగుస్తుందేమో?

ADVERTISEMENT
Latest Stories