అచ్చం టైటానిక్ ట్రాజెడీ స్టోరీలా ఉందేమిటో?

YCP Leaders

టైటానిక్ షిప్పు ఒక మహాద్భుతం… దానిలో ప్రయాణం ఇంకా మహాద్భుతం. టైటానిక్ షిప్ మంచుకొండని ఢీకొని మునిగిపోయే వరకు కూడా ఆ షిప్ కెప్టెన్ ప్రయాణికులకు జరుగబోయే పెను ప్రమాదం గురించి చెప్పలేదు. దాంతో వారు ఆటపాటలతో హాయిగా ఎంజాయ్ చేశారు.

టైటానిక్ షిప్ మంచుకొండని ఢీకొన్నాక కూడా అంత పెద్ద షిప్పుకి ఏమీ కాదనే అందరూ అనుకొన్నారు. ఒకవేళ ఏమైనా ప్రమాదం జరిగినా కెప్టెన్ తమని సురక్షితంగా ఒడ్డుకి చేర్చుతాడనే అందరూ గట్టిగా నమ్మారు. కానీ చివరికి టైటానిక్ షిప్ మునిగిపోయింది. దాంతో పాటే దాని కెప్టెన్, వైస్ కెప్టెన్ ఇంకా దానిలో ప్రయాణించిన వేలాదిమంది ప్రయాణికులు కూడా. ఈ కధ అందరికీ తెలుసు.

ADVERTISEMENT

వైసీపి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే టైటానిక్ సినిమా కళ్ళ ముందు మెదిలితే ఆశ్చర్యం లేదు. నాలుగున్నరేళ్ళ క్రితం వైసీపి అనే టైటానిక్ షిప్ కూడా ఇలాగే ఆర్భాటంగా ప్రయాణం మొదలుపెట్టింది. దారిలో అడ్డువచ్చిన టిడిపి, జనసేనలని గుద్దుకొంటూ ముందుకు దూసుకుపోయింది.

దానిలో ప్రయాణిస్తున్న వైసీపి నేతలందరూ ‘నువ్వే మా నమ్మకం జగన్‌…’ అనుకొన్నారు. కానీ ఆయనే మద్యలో కొందరిని షిప్పులో నుంచి సముద్రంలోకి పడేశారు. “భజన చాతకాని అసమర్దులు వాళ్ళందరూ…అందుకే బయటపడేశారు…” అని కొత్తగా భజన డ్యూటీలో జాయిన్ అయినవారు అనుకొన్నారు.

“మా నమ్మకం, మా వర్తమానం, మా భవిష్యత్ అన్ని నువ్వే జగన్‌…నీ ఫోటో తప్ప అన్యధా శరణం నాస్తి…” అంటూ స్టికర్స్ అంటించుకొంటూ, బస్సులు వేసుకొని తిరుగుతూ జగన్‌ భజన్ చేస్తున్నారు.
అయితే వారెక్కిన వైసీపి అనే టైటానిక్ షిప్పు మునిగిపోబోతోందని ఐప్యాక్ ఎప్పుడో గంట కొట్టి మరీ చెప్పింది. కానీ వారి కెప్టెన్ ఏనాడూ చెప్పలేదు. “నేను బటన్ నొక్కుతుంటాను మీరు కాస్త అటూ ఇటూ తిరిగితే చాలని” మాత్రమే చెప్పేవారు.

కానీ ఎన్నికలనే పెద్ద మంచుకొండ హటాత్తుగా కళ్లెదుట కనిపించేసరికి “టైటానిక్ షిప్పు ఎంత పెద్దదైనా ఇప్పుడు మీ భారం భరించే పరిస్థితిలో లేదంటూ…” మరి కొంతమందిని కెప్టెన్ బయటకు విసిరేస్తున్నారు. అయితే కెప్టెన్‌కి షిప్పు నడిపించడం చాతకాక మునిగిపోతుంటే, మద్యలో వారేమి పాపం చేశారు పాపం…” అంటూ ఒడ్డున కూర్చొన్న టిడిపి, జనసేనలు జాలి పడుతున్నాయి.

“సముద్రం మద్యలో విసిరేస్తే లైఫ్ బోట్లు కూడా లేవు…మా పరిస్థితి ఏమిటి?” అని వైసీపి నేతలు ప్రశ్నిస్తుంటే, అందాకా సముద్రంలో మునిగిపోకుండా ఈదుతూ ప్రాణాలు కాపాడుకోండి… ఒకవేళ ఎన్నికల తర్వాత షిప్పు మళ్ళీ పైకి తేలితే అందరినీ తప్పకుండా ఎక్కించుకొంటాము,”అని వైస్ కెప్టెన్స్ విజయ సాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణా రెడ్డి ధైర్యం చెపుతున్నారు. మరి వైసీపి షిప్పు ఒడ్డుకు చేరుతుందో లేదో? చూడాలి.

ADVERTISEMENT
Latest Stories